వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే జగన్ సర్కార్ పై పవన్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను ధిక్కరించిన బూత్ లెవల్ అధికారులు, వాలంటీర్లు ఇంటింటికి ఓటరు సర్వే ప్రక్రియలో భాగమవుతున్నారని పవన్ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతం, పారదర్శకతతో జరగాలని అన్నారు. కానీ, ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘాన్ని జనసేన డిమాండ్ చేస్తోందని పవన్ చెప్పారు.
మరోవైపు, బైజూస్ ట్యాబ్ ల వ్యవహారంపై పవన్ మండిపడ్డారు. బైజూస్ సంస్థ భారీగా నష్టాల్లో ఉందన్న కథనాలన ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. పీఎంఓ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తన ట్వీట్ ని పవన్ ట్యాగ్ చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదని, టీచర్ రిక్రూట్‌మెంట్లే, టీచర్ ట్రైనింగ్ లేదని అన్నారు. నష్టాలు వచ్చే స్టార్టప్‌కి కోట్లలో కాంట్రాక్టులు వస్తున్నాయని, వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్‌ను పాటించిలేదని ఆరోపించారు. ట్యాబుల పంపిణీకి ఎన్ని కంపెనీలు టెండర్లు దరఖాస్తు చేశాయి..? ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు..? ఇది పబ్లిక్ డొమైన్‌లో ఉందా? అన్న విషయాలపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు.
ట్యాబ్‌లు ఇవ్వడాన్ని తప్పుబట్టడం లేదని, కానీ ముందుగా పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని పవన్ డిమాండ్ చేశారు. బైజూస్ 2021లోనే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 17 రెట్లు నష్టాలు చవి చూసిందన్న కథనాన్ని పవన్ తన ట్వీట్ కు జతపరిచారు. విద్యారంగంపై పవన్ చేసిన విమర్శలపై జగన్ ప్రభుత్వం స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates