వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల పాత్రపై గత ఏడాది అక్టోబర్ లో వైఎస్ షర్మిల ఇచ్చిన సంచలన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షర్మిల వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. అది, జగనాసుర రక్త చరిత్ర అని చెల్లి షర్మిల తేల్చేసిందని లోకేష్ విమర్శలు గుప్పించారు. అబ్బాయి కిల్డ్ బాబాయ్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. అవినాష్ రెడ్డి కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా నిలబడటమే ఈ హత్యకు కారణం అయ్యుండొచ్చు అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలను లోకేష్ గుర్తు చేశారు.
మరోవైపు, ప్రకాశం జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కమ్మ సామాజిక ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ క్రమంలో జగన్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పై 65, తనపై 20 కేసులు పెట్టారని మండిపడ్డారు. సన్న బియ్యం సన్నాసి ఒకరు తన తల్లిని అవమానించారంటూ మాజీ మంత్రి కొడాలి నానిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. నోటికి వచ్చినట్లు తిడితే భయపడతామని అనుకుంటున్నారని, జగన్ అరుపులకు బెదరమని చెప్పారు. 16 నెలలు జైలుకు వెళ్లి వచ్చిన జగన్ అందరినీ జైలుకు పంపాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఏపీలో పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, జగన్ పాలన చూసి కొత్త పరిశ్రమలు రావడం లేదని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు రాముడు వంటి వారని, కానీ తన అటువంటి వాడిని కాదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు. మరికొద్ది నెలలో వైసీపీ పాలన ముగుస్తుందని, రాబోయేది టిడిపి ప్రభుత్వం అని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. సంపదను సృష్టించడమే టీడీపీ లక్ష్యమని, రాష్ట్రంలో పేదరికం రూపుమాపడమే ఎజెండాగా ముందుకు పోతామని లోకేష్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates