దేశరాజకీయాల్లోని రాజకీయ పార్టీల్లో దాదాపు స్పష్టమైన విభజన వచ్చేసింది. ఒకటి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే. రెండోది కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమి. మూడోది కూటమిగా కాకుండా దేనికదే విడివిడిగానే ఉంటున్న పార్టీలు. అంటే పై రెండు కూటములకు సంబంధంలేకుండా ఉంటున్న పార్టీల సంఖ్య 11. ఈ 11 పార్టీల్లో 91 మంది ఎంపీలున్నారు. ఎన్డీయేలో 38 పార్టీలున్నాయి. ఇండియా కూటమిలో 26 పార్టీలుండగా రెండు కూటములతో సంబంధంలేని పార్టీలు 11.
ఈ 11 పార్టీల ఖాతాలో 91 మంది ఎంపీలున్నారంటే మామూలు విషయంకాదు. వీటిల్లో వైసీపీ, బీజూ జనతాదళ్, బీఎస్పీ, టీడీపీ, ఎంఐఎం, శిరోమణి అకాలీదళ్, జనతా దళ్ (ఎస్), ఆర్ ఎల్పీ, శిరోమణి అకాలీదళ్ (మాన్), ఏఐయూడీఎఫ్ ఉన్నాయి. వీటిల్లో కూడా అవసరానికి తగ్గట్లుగా వైసీపీ, బీజూ జనతాదళ్, టీడీపీలు కేంద్రప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాయి. ఒడిస్సా అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించటంలేదని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మండిపోయారు. తాజాగా మొదలైన పార్లమెంటు సమావేశాల్లో కేంద్రప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నవీన్ ఆదేశించారు.
నిజానికి ఎన్డీయే ఖాతాలో 38 పార్టీలున్నాయని పేరేకానీ చాలా పార్టీలకు అంటే సుమారు 21 పార్టీలకు ఒక్క ఎంపీ కూడా లేరు. అయినా బీజేపీ ఎందుకు భాగస్వామ్యపార్టీలుగా చేసుకున్నది ? ఎందుకంటే వాటికి ఎంపీలు లేకపోయినా కనీసం 4-5 శాతం ఓట్లున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపోటముల్లో ఈ ఓట్లశాతం చాలా కీలకంగా మారబోతోంది.
సీట్లు లేకపోయినా ఓట్లశాతం ఉందికాబట్టే తమకు కలిసొస్తాయని ఎన్డీయే, ఇండియా కూటమి కొన్నిపార్టీలను తమతో కలుపుకున్నాయి. ఎన్డీయేతో పోల్చుకుంటే ఇండియా కూటమిలోనే పెద్ద పార్టీలున్నాయి. కాంగ్రెస్ తో కలుపుకుని తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన(ఉధ్థవ్), ఎన్సీపీ(శరద్) జేడీయూ, ఆప్ లాంటి ఎక్కువ మంది ఎంపీలున్న పార్టీలున్నాయి. వీటి బలాబలాలు రేపటి ఎన్నికల్లో తేలిపోతాయి. ఉత్తరాధిలో బీజేపీ బలం తగ్గిపోతోందనే టెన్షన్ పెరగటం వల్లే దక్షిణాదిలో మిత్రులను చేసుకోవాలని కొత్తపార్టీలకు ఆహ్వానం అందించింది బీజేపీ. మరి రాబోయే ఎన్నికల్లో ఏ కూటముల బలం పెరుగుతుందో తగ్గుతుందో చూడాలి.