2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ కాంబో రిపీట్ కావాలని అభిమానులు కోరుకుంటూనే వచ్చారు. రవితేజతో ప్రాజెక్టు మిస్సయ్యాక సన్నీ డియోల్ తో జాత్ చేస్తున్న మలినేని దాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఏప్రిల్ లేదా మే విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకోవైపు అఖండ 2 తాండవం రెగ్యులర్ షూటింగ్ మొదలైయ్యింది. సెప్టెంబర్ రిలీజ్ అధికారికంగా ప్రకటించారు కాబట్టి దానికి అనుగుణంగా షెడ్యూల్స్ వేసి ఆలస్యం లేకుండా చూసుకుంటున్నారు.
అసలు కిక్కిచ్చే న్యూస్ మరొకటి ఉంది. ఈ క్రేజీ బాలయ్య – మలినేని మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. దేవరకు అదిరిపోయే పాటలు, బిజిఎం చూశాక తమ హీరోకు తను పని చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ముఖ్యంగా జైలర్ లో రజనీకాంత్ ని ఎలివేట్ చేసిన విధానం దాని విజయంలో ఎంత కీలక పాత్ర పోషించిందో చూశాం. అలాంటిది మాస్ కి పర్యాయపదమైన బాలయ్యకు ఎలాంటి నేపధ్య సంగీతం ఇస్తాడో చెప్పనక్కర్లేదు. అగ్ర నిర్మాణ సంస్థ ప్యాన్ ఇండియా భారీ బడ్జెట్ తో రూపొందించే ప్లానింగ్ లో ఉంది.
నాలుగు విజయాలతో ఊపు మీదున్న బాలయ్య ఇకపై కూడా ఇదే దూకుడుని కొనసాగించే పనిలో ఉన్నారు. అఖండ 2, గోపీచంద్ మలినేని సినిమాల తర్వాత ఆదిత్య 999 పనులు మొదలుపెట్టబోతున్నారు. ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన క్లాసిక్ కి సీక్వెల్ కావడంతో స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మోక్షజ్ఞ హీరోగా తాను ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం వహించే ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించిన క్లూస్ ఆ మధ్య అన్ స్టాపబుల్ 4 షోలో ఇచ్చారు. ప్రస్తుతం డాకు మహారాజ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న బాలయ్య 2025లో మొత్తం రెండు రిలీజులతో సందడి చేస్తున్నారు.