నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా… మరీ కాస్తంత లోతుగా వెళితే మంగళగిరి శాసనసభ్యుడిగానే తెలుసు. దావోస్ లో లోకేశ్ అనుసరిస్తున్న డ్రెస్సింగ్ సెన్స్ అలానే కొనసాగితే… నిజంగానే ఆయనను ఓ మోడల్ గా, ఫ్యాషన్ ప్రపంచానికే ఐకాన్ గా కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ పదాలు కాస్తంత అతిశయోక్తులుగా కనిపిస్తున్నా… దావోస్ లో మంగళవారం నాడు లోకేశ్ కనిపించిన తీరును చూస్తే… ఈ మాటలు ముమ్మాటికీ నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే… జోధ్ పురీ సూట్ లో లోకేశ్ నిజంగానే ఫ్యాషన్ ఐకాన్ లా వెలిగిపోయారు.
ఓ ఫక్తు రాజకీయ నాయకుడిగా, తన పార్టీ కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా, తన రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలే అంతిమ లక్ష్యంగా పనిచేసుకుపోతున్న లోకేశ్.. పెద్దగా ఆర్భాటాలకు వెళ్లిన దాఖలా ఇప్పటిదాకా కనిపించలేదనే చెప్పాలి. ఎప్పుడూ తెల్లని చొక్కా… దాని మీదకు బ్లూ, బ్లాక్ కలగలసినట్లుగా కనిపించే ప్యాంట్ తో కనిపించే లోకేశ్.. ఎక్కడికి వెళ్లినా అదే డ్రెస్ లో కనిపిస్తారు. ఆ డ్రెస్ ను ఆయన తన డ్రెస్ కోడ్ గా ఎంచుకున్నారని కూడా చెప్పాలి. మొన్నటి అమెరికా పర్యటనలోనూ ఆయన అదే డ్రెస్ తో కొనసాగారు.
అయితే దావోస్ కేంద్రంగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల్లో మాత్రం తనలోని న్యూ డ్రెస్ సెన్స్ ను లోకేశ్ చూపిస్తున్నారు. వరల్డ్ టాప్ మోస్ట్ కంపెనీలన్నీ దావోస్ సదస్సుకు హాజరవుతాయి. అంటే… ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హారజరవుతారు. ఫలితంగా ఈ సదస్సు భిన్న రకాల అభిరుచులకు నెలవుగా కనిపిస్తుంది. ఇలాంటి వేదికలపై తనను తాను నూతనంగా ఆవిష్కరించుకునే క్రమంలో లోకేశ్.. ఇలా సరికొత్త డ్రెస్ సెన్స్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సదస్సు తొలి రోజు కలర్ ఫుల్ డ్రెస్ లో అలరించిన లోకేశ్…రెండో రోజు చూడ చక్కని సూట్ లో దర్శనమిచ్చి… అందరి దృష్టినీ ఆకట్టుకున్నారని చెప్పాలి.