జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన వాడీవేడిగా సాగిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరైన పవన్ బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యి ఏపీ రాజకీయాలపై చర్చలు జరిపారు. ఈ రోజు మధ్యాహ్నం ఏపీకి తిరిగి వచ్చిన పవన్…తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై వ్యాఖ్యల నేపథ్యంలో తనను ప్రాసిక్యూట్ చేయాలని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, తాను దేనికైనా రెడీ అని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
జనసేన కార్యాలయానికి ఆ జీవో వచ్చిందని, ఇదే ఆ జీవో అని మీడియా ప్రతినిధులకు పవన్ జీవో కాపీని చూపించారు. కావాలంటే తనను అరెస్టు చేసుకోవచ్చని, చిత్రవధ కూడా చేసుకోవచ్చని జగన్ కు పవన్ సవాల్ విసిరారు. దెబ్బలు తినేందుకైనా సిద్ధమని, జైలుకు వెళ్లేందుకు రెడీ అని ఛాలెంజ్ చేశారు.
కానీ, మర్డర్లు చేసేవారిని వ్యవస్థలు ఎలా కాపాడతాయో ఇక మీదట తాను చూస్తానని పవన్ అన్నారు. తన అరెస్ట్ కు రంగం సిద్ధం అయినట్టు అర్థమైందని, ఇదే జగన్ ప్రభుత్వ పతనానికి నాంది అని చెప్పారు. తాము ఒకసారి మాట అంటే ఎంత రిస్కుకైనా వెనుకాడనని, జగన్… చెబుతున్నాను కదా… సై అంటే సై… రెడీగా ఉన్నాను… రా… చూసుకుందాం అని జగన్ కు పవన్ సవాల్ విసిరారు.
రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తానని యువతను మోసం చేశావని, 5 వేలిచ్చి వాలంటీర్లుగా కొనేశావని దుయ్యబట్టారు. యువతను ఇలా చేసిన జగన్ పై జనసేన కచ్చితంగా తిరగబడుతుందని, యువతకు, వాలంటీర్లకు అండగా ఉంటుందని పవన్ అన్నారు. కాగా, వాలంటీర్లపై వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతిస్తూ జీవో నెం.16ను ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఆ జీవో ప్రకారం పవన్ పై సీఆర్పీసీ 199/4 (బి) కింద కేసులు పెట్టేందుకు అవకాశముంటుంది.