జంపిగుల జాబితా పెరుగుతోంది.. జాగ్ర‌త్త ప‌డండి కేసీఆర్ స‌ర్‌!

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యం దూసుకు వ‌స్తోంది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా కార్యాచ‌ర‌ణ ప్రారంభించింది. మ‌రో మూడు మాసాల్లో ఎన్నిక‌ల ముఖ‌చిత్రంపై స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తోంది. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో ఏ పార్టీలో అయిన‌ చేరిక‌లే ఉండాలి.

ముఖ్యంగా మూడో సారి కూడా తెలంగాణ కోట‌లో కారును ప‌దిలంగా ప‌రుగులు పెట్టించాల‌ని, రికార్డు సృష్టించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ కు అప్ర‌క‌టిత సెగ త‌గులుతోంది. పైకి మౌనంగా ఉన్నా.. లోలోన మాత్రం అంత‌ర్మ థ‌నం జ‌రుగుతోంది. ఎందుకంటే.. పార్టీ నుంచి జంప్ అయిపోయేవారి జాబితా రోజు రోజుకు పెరుగుతోంది.

కానీ, ఈ విష‌యంపై అన్నీ తెలిసినా సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే కీల‌క‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గంలో ముస‌లం పుట్టింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. సుమారు 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో రెడ్డి సామాజిక వ‌ర్గం బీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా(ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలోనే ఉన్నారు) చ‌క్రం తిప్పుతోంది. ఇక‌, ఇతర సామాజిక వ‌ర్గాలైన గౌడ త‌దిత‌రులు కూడా పార్టీ కి దూర‌మ‌య్యే ప‌రిణామాలు పెరుగుతున్నారు. వీరందరి చూపూ ఇప్పుడు కాంగ్రెస్ వైపే ఉంది పార్టీ అధిష్టానం అనుమ‌తి కోసం వేచి ఉన్న‌వారు .. అధిష్టానం అప్పాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న‌వారు పెరుగుతున్నారు.

ఈ నేప‌థ్యంలో బీఆర్ ఎస్‌లో ఏ నిముష‌మైనా.. జంప్ జిలానీలు తుఫాను పుట్టించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఇంత జ‌రుగుతున్నా బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం మౌనంగానే వీక్షిస్తున్నారు. పోయేవారిలో బ‌లం లేద‌ని భావిస్తున్నారో.. లేక పోయినా ఫ‌ర్వాలేద‌ని అనుకుంటున్నారో.. లేక‌.. తానే వారిని పంపించేస్తున్నారో తెలియ‌దు కానీ.. జంపింగుల జాబితా పెరుగుతున్నా.. ఎవ‌రూ కిమ్మ‌న‌డంలేదు. మ‌రి ఈ ప‌రిణామాలు బీఆర్ ఎస్‌కు ఎలాంటి ప‌రిణామాల‌ను చ‌వి చూపిస్తాయో చూడాలి.

రెడీగా ఉన్న జంపింగుల జాబితా ఇదీ..

— మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్ రావు(ఎమ్మెల్సీ ఇస్తామ‌ని ఇవ్వ‌లేదు)
— గద్వాల జడ్పీఛైర్ పర్సన్ తిరుపతయ్య
— మాజీ ఎమ్మెల్యే వేణుల వీరేశం
— మాజీ ఎమ్మెల్యే సునీల్ రెడ్డి
— మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి
— ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదరరెడ్డి
— పట్నం మహేందర్ రెడ్డి
— వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి
— మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి
— ఎనుగు రవీందర్ రెడ్డి
— మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్