పురందేశ్వరి సినిమా యుద్ధం చేస్తున్నారా ?

బీజేపీకి కొత్త అధ్యక్షురాలైన దగ్గుబాటి పురందేశ్వరి సినిమా యుద్ధం మొదలుపెట్టారు. సినిమాల్లో ఫైటింగ్ సీన్లు ఎలా తీస్తారో అందరికీ తెలిసిందే. అక్కడ కొట్టేవాడు కొట్టినట్లు నటిస్తాడు. దెబ్బలు తినేవాడు తిన్నట్లు నటిస్తాడు. కొట్టేవాడు నిజంగా కొట్టడు. తినేవాడు నిజంగా తినడు. ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పురందేశ్వరి యుద్ధం కూడా అచ్చం సినిమా యుద్ధం లాంటిదే. మీడియాతో పురందేశ్వరి మాట్లాడుతు జగన్ ప్రభుత్వం పై చాలా ఆరోపణలు, విమర్శలు చేశారు.

అప్పులపైన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంచాయితీల నిధుల మళ్ళింపు కారణంగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కూడా లేదన్నారు. ఒక్క పెట్టుబడి కూడా రాలేదన్నారు. పరిశ్రమలు రావటంలేదు, ఉద్యోగ, ఉపాధి కనబడటంలేదన్నారు. అప్పుల విషయంలో నోటి కొచ్చిన లెక్కలను అధ్యక్షురాలు చెప్పేశారు. అయితే ఈమె ఆరోపణలను, విమర్శలను మంత్రులు, వైసీపీ నేతలు ఎక్కడికక్కడ తిప్పికొడుతున్నారు.

నిజంగానే పుంరదేశ్వరికి జగన్ ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోవాలని ఉందా ? అన్నదే సందేహం. నిజంగానే అలా ఉంటే కేంద్రంలో ప్రభుత్వం వాళ్ళదే కదా. మరి అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ లేదా మరో ప్రతిపక్షం డిమాండ్ చేసినట్లుగా డిమాండ్ చేయటం ఏమిటి ? కేంద్రంలో ఉన్నది బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వమే అయినపుడు రాష్ట్రం చేసిన అప్పుల వివరాలను తెచ్చుకోవచ్చు కదా. జగన్ ప్రభుత్వం స్ధాయికి మించిన అప్పులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముంచేస్తున్నట్లు జనాలకు వివరించి చెప్పవచ్చుకదా.

ఇక పెట్టుబడులు ఎన్ని వచ్చాయి ? పరిశ్రమలు ఎన్ని ఏర్పాటయ్యాయనే వివరాలను కూడా ఆమె కేంద్రంలోని పరిశ్రమల శాఖ నుండి తెప్పించవచ్చు. లేదా పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులపై కేంద్రమంత్రితోనే ఒక మీడియా సమావేశం పెట్టించి ప్రకటన చేయించవచ్చు. చేసే ఆరోపణలు, విమర్శలను పద్దతిగా, నిర్మాణాత్మకంగా చేయిస్తే జనాలు కూడా వింటారు, నమ్మతారు. అంతేకానీ ఊరికే మీడియా సమావేశాలు పెట్టి సోదిచెబితే జనాలు నమ్మేరోజులు ఎప్పుడో పోయాయని పురందేశ్వరికి ఇంకా అర్ధంకావటంలేదేమో. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా మరికొంతకాలం పురందేశ్వరి సినిమా యుద్ధాన్ని భరించక తప్పదేమో.