తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్.. నేను నోరు విప్పితే నువ్వు ఈ రోజే ప్రగతి భవన్ నుంచి పారిపోతావ్ బిడ్డా!” అని అన్నారు. అంతేకాదు.. తాము ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నామని..కానీ, బీఆర్ ఎస్ నాయకులు, మంత్రులు కొందరు రెచ్చగొడుతున్నారని కోమటిరెడ్డి చెప్పారు. తాజాగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని చెప్పారు.
“మరో 100 రోజుల్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి ఎన్నికలు కావు. దొరలకు-పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో పేదలను గెలిపించుకుని తీరాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. మేం ఎక్కువగా మాట్లాడడం లేదు. ఆ పరిస్థితి వస్తే.. సీఎం కేసీఆర్ కుటుంబంతో సహా ప్రగతి భవన్ వదిలేసి..ఫాం హౌస్‌కు పారిపోతాడు” అని కోమటిరెడ్డి అన్నారు. ఈ నెలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభకు ప్రియాంక గాంధీ వస్తున్నారని.. ఈ సభలో మహిళలకు సంబంధించిన సమస్యలపై చర్చించి ఒక డిక్లరేషన్ ప్రకటిస్తామని కోమటిరెడ్డి చెప్పారు.
“కేసీఆర్‌కు దమ్ముంటే ఆయన అనంతరం ఈ రాష్ట్రానికి బీసీ వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా ప్రకటించాలి. కానీ ఆయన అలా చేయడు. ఎందుకంటే అధికారానికి అలవాటు పడ్డాడు. బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే. న్యాయం చేసేది కూడా మా పార్టీనే” అని కోమటి రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై సటైర్లు విసిరారు. ఆయనను విగ్గురాజ్‌గా పోల్చారు కోమటిరెడ్డి. “విగ్గు రాజ్ మంత్రి.. ఏం మాట్లాడతారో ఆయనకే తెల్వదు” అని విమర్శలు గుప్పించారు.
ఎన్నికలకు పెద్దగా సమయం లేనందున త్వరలోనే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా బస్సు యాత్రలు చేయనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. కేసీఆర్ అక్రమాలు, దోపిడీని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. అంతేకాదు.. రాష్ట్రంలో పోలీస్ రాజ్ నడుస్తోందని.. ఎవరు ప్రజాస్వామ్య యుతంగా ఆందోళన చేసినా విరుచుకుపడుతున్నారని విమర్శించారు. ఈ సారి ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయమని కోమటిరెడ్డి చెప్పారు.