జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేసిన వైనం ఏపీ రాజకీయాలలో సంచలనం రేపింది. ఇక, జగన్ సర్కార్ వైఫల్యాలను జాతీయ స్థాయిలో పవన్ ఎండగట్టిన తీరు కూడా వైసీపీ నేతలకు షాకిచ్చింది. మరోవైపు, ఎన్డీఏ కూటమిలోకి దారులు మూసుకుపోయాయనుకుంటున్న టీడీపీకి పవన్ రూపంలో ఆశలు చిగురించాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్‌తో పవన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాదెండ్ల మనోహర్ తో కలిసి మురళీధరన్ తో పవన్ దాదాపు 15 నిమిషాలపాటు సమావేశమయ్యారు. మురళీధరన్‌తో జరిగిన అల్పాహార సమావేశం లో రాబోయే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ చర్చించారని తెలుస్తోంది.
దాంతోపాటు, టీడీపీకి కూడా కలుపుకుపోతేనే వైసీపీని గద్దె దించగలమని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్డీఏలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని పవన్ చెప్పారట. మరోవైపు, ఈ రోజు మరి కొంతమంది బీజేపీ నేతలను పవన్ కలిసి ఏపీ రాజకీయాలపై, పొత్తులపై చర్చించే అవకాశం ఉంది.