ఇపుడిదే విషయం బీఆర్ఎస్ నేతల మధ్య చర్చ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టో అంటు ప్రత్యేకంగా ఏమీ ప్రకటించకుండానే ఎన్నికలకు వెళితే ఎలాగుంటందనే విషయాన్ని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. చేయబోయే అభివృద్ధి, అమలుచేయబోయే సంక్షేమ పథకాలపై జనాలకు ఇచ్చే హామీయే మ్యానిఫెస్టో. రెండు వరుస ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా గ్రౌండ్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇవ్వబోయే హామీలు ఏముంటాయని ఆలోచిస్తున్నారట.
ఇప్పుడు అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధిలోనే ఏవైనా లోటు పాట్లుంటే సరిదిద్దుకుని మరింత మెరుగ్గా అమలు చేస్తామని చెబితే సరిపోతుంది కదాని కేసీయార్ అనుకుంటున్నారట. నిజానికి గడచిన రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్నింటిని కేసీయార్ అమలు చేయటం లేదు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 3 ఎకరాల హామీ, హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో ప్రకటించిన దళితబంధు, అంతకుముందు ప్రకటించిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళ కేటాయింపు లాంటి అనేక పథకాలు సరిగా అమలుకావటం లేదు.
సక్రమంగా అమలుకాని పథకాలు చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. అయితే తానిచ్చిన అన్నీ పథకాలను అమల్లో ఉన్నట్లు కేసీయార్ పదేపదే చెప్పుకుంటున్నారు. దీన్ని ప్రశ్నించేంత ధైర్యం మీడియాలో కూడా లేదు. అందుకనే కేసీయార్ ఏమి చెబితే అదే చెల్లుబాటైపోతోంది. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు, విమర్శలను హైలైట్ చేయటం వరకే మీడియా పరిమితమైపోయింది.
ఈ నేపధ్యంలో కొత్త మ్యానిఫెస్టో ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తున్నట్లు పార్టీవర్గాల టాక్. ఒకవేళ మ్యానిఫెస్టో ప్రకటించాలన్నా కొత్త హామీలను ఏమి ఇవ్వాలన్నది పెద్ద పజిల్ అయిపోయింది. రైతుల కోసం, పేదల కోసం, విద్యార్ధుల కోసం ఇప్పటికే కేసీయార్ అనేక హామీలను ఇచ్చేశారు. వాటి అమలు సంగతి అడక్కపోతే సరిపోతుంది. అందుకనే కొత్తగా హామీలు ఇవ్వాల్సిన అవసరం ఏముందని కేసీయార్ ఆలోచిస్తున్నది. మొత్తానికి కేసీయార్ ఆలోచన కూడా ఒకందుకు మంచిదేనేమో. ఇపుడు అమలవుతున్నవి, అమలుకు నోచుకోని వాటిపై దృష్టిపెడితే అది కూడా మంచిదే. మరి చివరకు కేసీయార్ ఏమిచేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates