కేరళ పూర్వ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. 79 ఏళ్ళ ఊమెన్ చాందీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతంలో ఉదర, గొంతు సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నా రు. కాగా.. కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న కుమరకోమ్ గ్రామంలో ఊమెన్ చాందీ 1943 అక్టోబరు 31న జన్మించారు.
22 ఏళ్ల వయసులో సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో ఊమెన్ చాందీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించా రు. నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తర్వాత ఆయన ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు. మొత్తం 12 సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టారు.
అయితే.. మొత్తం 12 సార్లు కూడా ఆయన ఒకే నియోజకవర్గం పూతుపల్లి నుంచే విజయం సాధించడం గమనార్హం. ఊమెన్ చాందీ 1977లో అప్పటి కాంగ్రెస్ నేత కె. కరుణాకరన్ మంత్రివర్గంలో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 50 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చాందీ ఏనాడూ పార్టీ మారకపోవడం గమనార్హం. అంతేకాదు.. విపక్షాలకు స్వేచ్ఛనిచ్చిన ముఖ్యమంత్రిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు.
కేరళలో విద్యా వ్యాప్తికి, అధునాత వసతులకు జీవం పోశారు చాందీ. ఆయన హయాంలో మంత్రులపై ఆరోపణలు రాగా.. అధిష్టానాన్ని ఒప్పించి.. వారిని మార్చేశారు. అంతేకాదు.. ప్రతి పనినీ పారదర్శకంగా చేసేలా పార్టీని ముందుకు నడిపించారు. మహిళలకు ప్రాతినిథ్యం పెంచేలా చర్యలు తీసుకున్నారు. చాందీ హయాంలోనే కేరళలో నూతన విద్యా విధానం అమలైంది. “రాజకీయాల్లో ఉన్న వారు.. సౌమ్యంగా ఉండాలి. ఇది ఉద్యోగం కాదు. నెలనెలా జీతం రావడానికి. ఇది ప్రజాసేవ. వారి అభిమానమే జీతం” అని నొక్కి చెప్పిన 79 ఏళ్ల చాందీ జీవితాంతం వివాద రహితుడిగానే జీవించారు.