ఏపీ అధికార పార్టీ వైసీపీలో మైనస్‌లు కోకొల్లలు. దాదాపు 40 నియోజకవర్గాల్లో నాయకులు కీచులాడుకుం టున్నారు. కొన్నిచోట్ల అయితే.. పొలిటికల్ కబడ్డీ స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాల్లోని విశాఖ, కృష్ణా, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు వంటి ప్రాంతాల్లో మంత్రులకు, నాయకులకు పడడం లేదు. ఎమ్మె ల్యేలకు ఎమ్మెల్యేలకు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక, తమ నియోజకవర్గాలతో సంబంధం లేకపోయినా.. ఆధిపత్య ధోరణి కనిపిస్తున్న జిల్లాలు ఉన్నాయి.
దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల పరిస్థితి రెండు అడగులు ముందుకు..నాలుగు అడుగులు వెనక్కి చందంగా ఉంది. దీనిని సరిచేసేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ వైసీపీ అంతర్గత కుమ్ములాటలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజల్లోకి వెళ్లడంలో టీడీపీ వెనుకబడుతోందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. చిన్న అవకాశం దొరికినా దూసుకుపోవాల్సిన సమయం ఇది.
కానీ, ఆ తరహా చొరవ కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఉదాహరణకు ఉమ్మడి తూర్పులోని జగ్గం పేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు జుట్టు జుట్టు పట్టుకుంటున్నారు. అదేవిధంగా రామచంద్రపురం లోనూ వైసీ పీ అంతర్గత కలహాలు వేడెక్కాయి. ఇక, కడపలోని రాజంపేట, గుంటూరులో తూర్పు, వెస్ట్, ఉమ్మడి కృష్ణాలో పెడన, మైలవరం, కైకలూరు, విజయనగరంలో పాతపట్నం.. ఇలా.. లెక్కకు మిక్కిలిగా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు కుమ్మేసుకుంటున్నారు.
మరి ఇలాంటి సమయంలో టీడీపీ ఆయా పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని పుంజుకుంటే.. తిరుగు ఉండదనే సంకేతాలు వస్తున్నాయి. అయితే.. మైలవరం.. పలాస వంటి ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రం కొంత బాగానే ఉన్నా.. ఇతర నియోజకవర్గాల్లో తమ్ముళ్లు ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉండడం గమనార్హం. అయితే.. ఎన్నిలకకు సమయం ఎంతో లేదని చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో తమ్ముళ్లు ఇప్పటికైనా కదలాల్సిన అవసరం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates