ఆ.. ఎనిమిది వేల కోట్లు ఏమైన‌ట్టు..? రేవంత్ ప‌వ‌ర్ లెక్క‌లు!!

తెలంగాణ‌లో అధికార పార్టీ బీఆర్ఎస్‌కు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌కు మ‌ధ్య ప‌వ‌ర్‌(విద్యుత్‌) పాలిటిక్స్ జోరుగా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ప‌వ‌ర్ లెక్క‌లతో అధికార పార్టీపై విరుచు కుప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కొన్ని లాజిక్కుల‌ను కూడా ప్ర‌శ్నించారు. అస‌లు ప్ర‌భుత్వం రైతుల‌కు ఇస్తామ‌ని చెప్పిన విద్యుత్ ఎంత‌? గంట‌లు ఎన్ని? ఎంత విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తోంది? ఎన్ని గంట‌లు ఇస్తోంది? వంటి తారీకులు, ద‌స్తావేజుల‌తో స‌హా రేవంత్ రెడ్డి విరుచుకుప‌డ్డారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గత ఎన్నిక‌ల స‌మ‌యంలో రైతుల‌కు రోజంతా విద్యుత్ ఇస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చార‌ని తెలిపారు. ఈ హామీని తూ.చ. త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతున్న స‌ర్కారు.. కొన్ని లెక్క‌లు కూడా వెల్ల‌డించింద‌ని పేర్కొంటూ.. ఆయా లెక్క‌ల‌ను మీడియా ముందు ప్ర‌దర్శించారు. స‌ర్కారు చెబుతున్న‌ లెక్కల ప్రకారం.. 20 వేల మిలియన్ యూనిట్లు(అంటే 2 వేల కోట్ల యూనిట్లు) విద్యుత్ అవసరం అవుతుందని రేవంత్ చెప్పారు.

అయితే.. ఈ విద్యుత్ కొనేందుకు ప్రభుత్వం ఏటా 16వేల‌, 500 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు తెలుపుతోంద‌ని రేవంత్ చెప్పారు. కానీ.. వాస్త‌వానికి ఎక్క‌డా కూడా ఏ జిల్లాలో కూడా.. 24 గంటల విద్యుత్ ఇచ్చిన ప‌రిస్థితి లేద‌ని రేవంత్ చెప్పారు. కేవ‌లం రోజుకు 8 – 11 గంటల మ‌ధ్యే విద్యుత్ ఇస్తున్నార‌ని తెలిపారు. అంతేకాదు.. కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే.. మ‌రిన్ని త‌క్కువ గంట‌లే విద్యుత్ ఇస్తున్నార‌ని రేవంత్ లెక్క‌లతో స‌హా చెప్పారు.

ఇక‌, స‌ర్కారు చెబుతున్నట్టు 24 గంట‌ల పాటు క‌రెంటు ఇస్తే రూ.16 వేల కోట్లు ఖ‌ర్చ‌వుతుందని, కానీ, కేవ‌లం 8 గంట‌ల నుంచి 11 గంట‌ల మ‌ధ్యే విద్యుత్ ఇస్తుండ‌డంతో దీనిలో స‌గ‌మే ఖ‌ర్చువుతుంద‌ని రేవంత్ ఆరోపించారు. అంటే.. దీనిని బ‌ట్టి స‌ర్కారు చెబుతున్న విద్యుత్ ఖ‌ర్చుకు,క్షేత్ర‌స్థాయిలో ఖ‌ర్చుకు పొంత‌న లేద‌ని రేవంత్ పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో కేవ‌లం 8 వేల కోట్లు మాత్ర‌మే విద్యుత్ కు ఖ‌ర్చు పెడుతున్నార‌ని.. మిగిలిన 8 వేల కోట్లు ఏమ‌వుతున్నాయ‌ని ఆయ‌న గ‌ణాంకాల‌తో స‌హా ప్ర‌శ్నించారు.

“24 గంటల పేరిట ఖర్చు చూపిస్తున్నారు. కానీ ఇవ్వడం లేదు. మరి రూ.8 వేల కోట్లు ఎక్కడికిపోతున్నాయి. ఏ బ్యాంకుల్లోకి వెళ్తున్నాయి. ఏ ఫామ్ హౌసుల్లోకి వెళ్తున్నాయి” అని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రేవంత్ నిలదీశారు.