ఊరకరారు మహానుభావులు.. అనే మాట ప్రస్తుతం ఎన్నికలకు ముందు జరుగుతున్న రాజకీయ జంపింగ్ జిలానీలకు కూడా వర్తిస్తుంది. “దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి!” అనే మాట నాయకులు తరచుగా పాటిస్తుంటారు. అందుకే.. ఎప్పుడూ కూడా ఎన్నికలకు ముందు టికెట్ల కోసం జోరుగా జంపింగులు చేస్తారు. ఎన్నికల తర్వాత.. వివిధ కేసుల నుంచి రక్షించుకునేందుకు అధికార పార్టీతో చేతులు కలుపుతారు. ఇది ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా దిగ్విజయంగా జరుగుతున్న జంప్ జిలానీల కథ! దీనికి ఎవరూ అతీతులు కారనేలా.. వ్యవహారం నడుస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా విశాఖ జిల్లాకు చెందిన పంచకర్ల రమేష్‌బాబు జనసేనలోకి చేరారు. అయితే.. ఈయన చెబుతున్నట్టు తానేమీ ఆశించ కుండానే జనసేనలోకి వచ్చారంటే.. విశాఖ వాసుల నుంచి ఆయన అనుచరుల వరకు ఎక్కడా ఎవరూ నమ్మడం లేదు. ఎందు కంటే.. సీనియర్ నాయకుడు కావడం, బలమైన కాపు సామాజిక వర్గానికిచెందిన వ్యాపార వేత్త కావడంతో ఆయన చాలా వ్యూహాత్మకంగానే జనసేన తీర్థం పుచ్చుకున్నారనే చర్చ సాగుతోంది. అసలు విషయం ఏంటంటే.. గతంలో ప్రజారాజ్యం తరపున పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలుపుగుర్రం ఎక్కారు.
తర్వాత.. 2014 ఎన్నికలకుముందు టీడీపీలోకి వచ్చారు. అప్పట్లో టికెట్ ఇస్తారని ఆశతోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నా రు. కానీ.. టికెట్ దక్కలేదు. దీంతో 2019లో అతి కష్టంమీద టికెట్ దక్కించుకున్నారు. అయితే.. అటు నుంచి ఇటు మారిన రాజకీయంతో యూవీ రమణమూర్తి రాజు వైసీపీ తరఫున టికెట్ దక్కించుకుని పోటీ చేశారు. దీంతో పంచకర్లకు టీడీపీ టికెట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ఓడిపోయారు. ఆ వెంటనే తన వ్యాపారాల కోసం అంటూ.. వైసీపీ పంచన చేరిపోయారు. కానీ, సుతిమెత్తగా మాత్రం.. టీడీపీ ఓటమికి బాధ్యత వహిస్తున్నానని చెప్పారు.
అంటే చల్లకొచ్చి ముంత దాచిన ఫార్ములాను అనుసరించారనే టాక్ వచ్చింది. ఇక, ఇప్పుడు వైసీపీలో నిన్నటి వరకు ఉన్నారు. కాపు నాయకుడు కావడంతో వాస్తవానికి వైసీపీలో ఆయనకు ఎలాంటి సెగా లేదు. కానీ, ఎటొచ్చీ.. టికెట్ బెడదే ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ పెందుర్తి నుంచి రమణమూర్తి రాజుకే వైసీపీ టికెట్ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. మరో వైపు మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం..అనకాపల్లిని వదిలేసి పెందుర్తిపై కొన్నాళ్లుగా దృష్టి పెడుతున్నారు. అంటే.. వీరిద్దరి పోరులో తనకు టికెట్ దక్కడం కష్టమని పంచకర్ల నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇక, పార్టీలో ఉండడం కన్నా.. బయటకు రావడమే బెస్ట్ అని వచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక, జనసేనలోకి వచ్చీరాగానే తాను ఏమీ ఆశించి రాలేదని అన్నారు. కానీ, ఈయన హిస్టరీ చూస్తే మాత్రం టికెట్ కోసమే జంప్ చేస్తారనే విషయం స్పష్టమవుతుందని జనసేనలో గుసగుస వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పంచకర్ల విషయంలో పవన్ ఏం చేస్తారు? అనేది చర్చనీయాంశంగా మారింది. పెందుర్తి వంటి బలమైన నియోజకవర్గంలో ఆయనకు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఎంత మేరకు ఉంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates