ఎన్నికల ముందు టికెట్ల వ్యవహారం టీడీపీలో వివాదాలకు దారితీస్తోంది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు ఇలాంటి నియోజకవ ర్గాల విషయంలో ఆయన నొప్పింపక.. తానొవ్వక అనే ఫార్ములాను అనుసరిస్తున్నారు. గిరిజన నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే.. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయా నియోజకవర్గాల్లోనూ తాము బలపడాలని .. గెలుపు గుర్రం ఎక్కాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నియోజకవర్గాలవారీగా నాయకులను పిలిచి.. చర్చించి టికెట్లు కన్ఫర్మ్ చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో కీలకమైన అరకు అసెంబ్లీ నియోజకవర్గంపై ఇటీవల చర్చించారు. ఇక్కడ ఇద్దరు యువ నాయకులు టీడీపీలో టికెట్ కోసం పరస్పర్ పెనుగులాడుతున్నారు. వీరిలో ఒకరు మాజీ యువ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ కాగా, మరొకరు దొన్ను దొర. వీరిలో కిడారి ప్రస్తుతం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా వున్నారు. 2014 ఎన్నికల్లో కిడారి తండ్రి ఇక్కడ నుంచి వైసీపీ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. తర్వాత టీడీపీలో చేరారు. అయితే.. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లోఆయన కొద్దికాలానికే మరణించారు. దీంతో శ్రావణ్‌కుమార్‌కు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోయినా.. చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు.
ఇక, అప్పటి నుంచి కూడా ఆయనే ఇక్కడ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక, ఎస్టీ టీడీపీ సెల్ ఇంచార్జ్‌గా ఉన్న దొన్నుదొర పార్టీని బలోపేతం చేయడంలో ముందున్నారు. తాజాగా టికెట్ విషయానికి వచ్చేసరికి ఇద్దరూ కూడా పోటీ పడుతున్నారు. వీరికి గిరిజనుల్లో రెండు వేర్వేరు తెగల మద్దతు ఉంది. పైగా అరకులో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న గిరిజన తెగకు దొన్ను దొర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో తనకు ఈ సారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే.. పార్టీ తరఫున తన తండ్రి ప్రాణాలు పణంగా పెట్టారని.. కాబట్టి తనకే ఇవ్వాలని కిడారి కోరుతున్నారు.
అంతేకాదు.. సంప్రదాయంగా కూడా ఈ టికెట్ తనకే ఇవ్వాలని కిడారి ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కూడా తన తెగకు చెందిన వారేనని.. సునాయాసంగా ఓడిస్తానని ఆయన చెబుతున్నారు. దీంతో టీడీపీలో యాక్టివ్‌గా ఉన్న ఇద్దరూ టికెట్ కోసం పోరు సల్పడంతో చంద్రబాబు ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని ఎంపిక చేయడంపై వాయిదా మంత్రం పఠించారు. మరో రెండు మాసాల తర్వాత.. నివేదికలు తెప్పించుకుని.. అప్పుడు నిర్ణయిస్తానని ఆయన తేల్చి చెప్పారు. మరి అప్పటికి ఏం జరుగుతుందో చూడాలి.