టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలపై కన్నేసిన వైసీపీ.. ఆయా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తమ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే కుప్పం, టెక్కలి, హిందూపురం, పాలకొల్లు, కొండపి వంటి బలమైన టీడీపీ వర్గం ఉన్న నియోజకవర్గాలపైనా వైసీపీ వ్యూహా త్మకంగా పావులు కదుపుతోంది. ఇక,ఇవన్నీ.. కూడా టీడీపీ ఫైర్‌బ్రాండ్స్ చేతిలో ఉన్న నియోజకవర్గాలే కావడం గమనార్హం.
ఈ జాబితాలో ఉన్న మరో నియోజకవర్గం పరుచూరు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి వరుసగా టీడీపీ విజయం దక్కించుకుంటోంది. ఆదిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు(చంద్రబాబు తోడల్లుడు కాంగ్రెస్, టీడీపీ తరఫున కూడా విజయం దక్కించుకున్నారు) తర్వాత.. ఆయన పార్టీకి దూరం కావడం.. వైసీపీ పంచన చేరిన దరిమిలా.. 2014, 2019 ఎన్నికల్లోటీడీపీ అభ్యర్థిగా.. ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు.
వాస్తవానికి ఏలూరి వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రజలను నమ్ముకుని.. ప్రజల మధ్య ఉండే నాయకు ల్లో ఏలూరి కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే.. దగ్గుబాటి వైసీపీ నుంచి దూరం కావడంతో ఇక్కడ ఆయన ఇలాకాలో వైసీపీ పాగా వేయడం ద్వారా.. ఇటు దగ్గుబాటికి, అటు టీడీపీకి కూడా ఒకే సారి చెక్ పెట్టాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. అందుకే..ఇక్కడ ఇంచార్జిగా.. చీరాలకు చెందిన ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారు.
కానీ, ఆమంచి మనసు మాత్రం.. చీరాలపైనే ఉంది. దీంతో చుట్టపు చూపుగా మాత్రమే పరుచూరుకు ఆయన వచ్చిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా వైసీపీ ఈ నియోజకవర్గంలో చుక్కాని లేని నావగా ప్రయాణం చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇంకో వైపు.. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి.. ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. పార్టీకార్యక్రమాలు.. సొంతగా రూపొందించుకున్న షెడ్యూల్‌ను ఆయన అమలు చేస్తున్నారు. దీంతో వైసీపీ ఇక్కడ గెలుపుగుర్రం ఎక్కడ సాధ్యం కాదనే అంచనాలు రావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates