కమలం నుండి హస్తంలోకేనా ?

తెలంగాణా షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కమలం పార్టీలో నుండి కొందరు సీనియర్లు హస్తం పార్టీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అలాంటి నేతలను గుర్తించి ఈటల రాజేందర్ భేటీ అవుతున్నా ఎక్కువ రోజులు ఆ నేతలు బీజేపీలో ఉండేట్లు కనబడటంలేదు. ఒకవైపు బీజేపీ డీలా పడిపోతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ మీద నేతల్లో క్రేజు పెరుగుతోంది. అందుకనే ఒకపుడు బీజేపీలో నుండి బీఆర్ఎస్ లో చేరాలని ఆలోచించిన నేతల్లో కొందరు తాజాగా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే విషయాన్ని ఆలోచిస్తున్నారట.

మాజీ మంత్రులు ఏ చంద్రశేఖర్, రవీంద్రనాయక్ తో పాటు జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి గట్టి నేతలు కాంగ్రెస్ లో చేరిపోవటం దాదాపు ఖాయమైపోయిందని సమాచారం. కాకపోతే నాలుగు రోజులు ఆలస్యమయ్యేట్లుందంతే. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చేట్లు లేదనే విషయం బాగా చర్చ జరుగుతోంది. నిజానికి ఒకపుడు బీఆర్ఎస్ ను ఢీ కొనేంత శక్తి బీజేపీకి మాత్రమే ఉండేదనేంత ఊపు బాగుండేది. అలాంటిది ఇపుడు పార్టీ నీరుగారిపోయింది.

దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిదేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్, రెండోదేమో కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం. లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్టు ఖాయమని బీజేపీ నేతలే విపరీతంగా ప్రచారంచేశారు. అలాంటిది కవితను ఈడీ విచారించి చాలాకాలమైనా ఇంతవరకు అరెస్టు జరగలేదు. ఇదే సమయంలో ప్రతిరోజు నరేంద్రమోడీపై ఒంటికాలిపై లేచే కేసీయార్ చాలా రోజులుగా చప్పుడు చేయటంలేదు. దీంతోనే రెండుపార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందన్న కాంగ్రెస్ ఆరోపణలను జనాలు కూడా నమ్ముతున్నారు. అందుకనే బీజేపీకి ఊపు తగ్గిపోయింది.

ఇక కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించటంతో తెలంగాణా నేతల్లో కూడా మంచి ఊపొచ్చేసింది. కర్నాటకలోని సీనియర్లంతా ఏకతాటిపైన నిలబడిన కారణంగానే ఎన్నికల్లో విజయం సాధించగలిగింది. అదే సూత్రాన్ని తెలంగాణాలో కూడా ఎందుకు అనుసరించకూడదని అధిష్టానం తెలంగాణా నేతలను గట్టిగా నిలదీసింది. ఇదే సమయంలో సీనియర్లలో కూడా రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోతే ఇక భవిష్యత్తులో రాదన్న టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి మరీ ఏకతాటిపైకి రావాలన్న ఆలోచన వచ్చింది. అందుకనే బీజేపీలో నుండి నేతలు కాంగ్రెస్ వైపు వచ్చేస్తున్నట్లు సమాచారం.