శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయిచేసుకున్న ఘటన పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఇప్పటికే పలుమార్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పవన్ స్వయంగా తిరుపతి వచ్చారు. సీఐ అంజూ యాదవ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.
అంతకుముందు, రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో పవన్ కు స్వాగతం పలికేందుకు వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దాదాపు 15 కిలోమీటర్లు భారీ ర్యాలీని జనసైనికులు నిర్వహించారు. ఆ తర్వాత సీఐ అంజూయాదవ్ చేతిలో దెబ్బలు తిన్న సాయితో పాటు మరో ఆరుగురితో వెళ్లి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి పవన్ ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణ నిర్వహించి డీజీపీకి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు, పవన్ పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతిపత్రం అంటూ తిరుపతిపై పవన్ దండయాత్రకు వచ్చారని ఎద్దేవా చేశారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై పవన్ ఇంతమందితో దాడి చేసేందుకు వచ్చిన్నట్టు ఉందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న తమ పార్టీపై నిందలు వేస్తున్నాడని, తనకు ఓటు వేస్తే ఏం చేస్తాడో పవన్ ఎప్పుడూ చెప్పరని చురకలంటించారు. పగ, ప్రతీకారాలతో భీష్మ ప్రతిజ్ఞలు మాత్రమే పవన్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates