విశాఖ‌లో జ‌న‌సేన బ‌ల‌ప‌డేనా? పంచ‌క‌ర్ల చేరిక వెనుక‌!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ స‌ర్కారును గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడుకు కొంద‌రు నేత‌లు ఫిదా అవుతున్నారు. వారాహి యాత్ర 2.0 త‌ర్వాత పార్టీలో చేరిక‌లు జ‌రుగుతున్నాయి. ఒక‌రిద్ద‌రే అయినా.. కీల‌క నేత‌లు.. సామాజిక వ‌ర్గాల ప‌రంగా బ‌ల‌మైన నాయ‌కులు కావ‌డంతో వారి చేరిక‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చీరాల నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ సోద‌రుడు స్వాములు చేరిన విష‌యం తెలిసిందే.

తాజాగా విశాఖ‌కు చెందిన బ‌ల‌మైన నాయ‌కుడు, ప్ర‌జ‌ల్లో మంచి పేరున్న నేత పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు సైతం జన‌సేన‌కు జై కొట్టారు. తాజాగా ఆయ‌న మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో ప‌వ‌న్‌తో భేటీ అయ్యారు. రెండు మూడు రోజుల్లో మంచి రోజు చూసుకుని జనసేన పార్టీలో చేరుతున్నట్లు పంచకర్ల ప్ర‌క‌టించారు. తాను ఏ ప‌ద‌వులూ ఆశించి రాలేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జ‌న‌సేన‌లో కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు. అదేస‌మ‌యంలో ప‌వ‌న్ ఎలాంటి బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని తెలిపిన పంచ‌క‌ర్ల‌.. తన అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకుంటుందని పవన్ హామీ ఇచ్చిన‌ట్టు తెలిపారు.

“జనసేన పార్టీ భావజాలం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న తపన చూసి నేను కూడా ఒక సైనికుడిలా ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నాను. అదే విషయం ఆయనతో చెప్పాను. ఈ నెల 20న అనుచరులతో క‌లిసి పార్టీలో జాయిన్ అవుతాను” అని పంచ‌క‌ర్ల‌ అన్నారు.

ఎవ‌రీ పంచ‌క‌ర్ల‌..

పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు మాజీ ఎమ్మెల్యే. గ‌తంలో టీడీపీలో ప‌నిచేశారు. త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చారు. విశాఖ జిల్లా వైసీపీకి అధ్యక్షుడుగా ప‌నిచేశారు. అయితే.. విశాఖ వైసీపీలో త‌లెత్తిన ఆధిప‌త్య రాజ‌కీయాల‌తో ఆయ‌న కొన్నాళ్ల కింద‌ట పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. త‌న ప‌రిస్థితి వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు చెప్పేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించినా.. అప్పాయింట్‌మెంట్ ల‌భించ‌క‌పోవ‌డంతో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.