పురందేశ్వ‌రిపై ఆర్ఎస్ఎస్‌కు కంప్లెయింట్‌!

బీజేపీ ఏపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అన్న‌గారు ఎన్టీఆర్ గారాల‌ప‌ట్టి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి గురించి.. ఇప్ప‌టికే అనేక చ‌ర్చ‌లు.. అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చేశాయి. అయితే.. ఎవ‌రూ గుర్తించ‌ని ఒక విష‌యాన్ని తాజాగా బీజేపీ పెద్ద‌లు ఆర్ ఎస్ ఎస్‌కు కంప్లెయింట్ చేశాయ‌ట‌. అయితే.. ఈ ఫిర్యాదు ఎవరు చేశారు? అనేది మాత్రం ప్ర‌స్తుతానికి అత్యంత గోప్యంగా ఉంచారు. కానీ, క‌మ‌ల నాథుల చ‌ర్చ‌ల్లో మాత్రం ఫిర్యాదుపై మాత్రం తీవ్ర‌స్థాయిలో ఆస‌క్తి రేగుతోంది.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నిర్ణ‌యానికి ఆ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం.. ఓకే చెప్పి పురందేశ్వ‌రికి ఏపీ ప‌గ్గాలు అప్ప‌గించింది. అయితే.. వాస్త‌వానికి ఎంత కాద‌న్నా.. ఔన‌న్నా.. బీజేపీకి ఆర్ ఎస్ ఎస్‌తో ఉన్న బంధం.. సంబంధం పేగు బంధ‌మ‌నే విష‌యం తెలిసిందే. దీంతో ఏ నాయ‌కుడు ఎక్క‌డ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టినా ఆర్ ఎస్ ఎస్ క‌నుస‌న్న‌ల్లోనే ఆ విధానాల‌ను అనుగుణంగానే ప‌నిచేయాల్సి ఉంటుంది. అయితే.. కొన్నాళ్లుగా బీజేపీలో జ‌రుగుతున్న నియామ‌కాలకు ఆర్ ఎస్ ఎస్‌తో సంబంధం క‌ట్ అయింది.

అయినా కూడా ఆర్ ఎస్ ఎస్ మాత్రం కొన్ని విష‌యాల్లో ప‌ట్టుద‌ల‌తోనే ముందుకు సాగుతోంది. ముఖ్యంగా హిందూ ఇజాన్ని ప్రోత్స‌హించ‌డం.. దేశాన్ని హిందూ దేశంగా ప్ర‌క‌టించ‌డం అనే రెండు విధానాల‌ను కూడా.. ఆర్ ఎస్ ఎస్ నుంచే బీజేపీ పుణికిపుచ్చుకుంది. ఇదే సిద్ధాంతంతో ముందుకు సాగుతోంది. అయితే.. ఏపీలో జ‌రిగిన నియామ‌కం విష‌యంలో పురందేశ్వ‌రికి ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాల‌తో ప‌రిచ‌యం లేదు. స‌రే.. గ‌తంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు కూడా తెలియ‌దు.

కానీ, మ‌రో కీల‌క విష‌యం ఇప్పుడు పార్టీ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ‌గా మారింది. పురందేశ్వ‌రి దేవుడిని న‌మ్మ‌రని, నాస్తికురాల‌ని వారు ప్ర‌చారం చేస్తున్నారు. గ‌తం ప‌రిశీలించినా.. ఎప్పుడూ పురందేశ్వ‌రి ఏ ఆల‌యానికీ వెళ్లింది లేదు. ఏ దేవుడికీ మొక్కింది కూడా లేదు. దీంతో ఏపీలో హిందువుల ఓటు బ్యాంకును ఎలా కూడ‌గ‌డ‌తార‌నేది ఇప్పుడు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో క‌మ‌ల నాథులు తెగ బాధ‌ప‌డుతున్నారు. ఇదే విష‌యాన్ని సీమ‌కు చెందిన, ఈ ప‌ద‌విని ఆశించిన నాయ‌కుడు ఆర్ ఎస్ ఎస్ కు ఫిర్యాదు చేశార‌ని పార్టీ నేత‌ల మ‌ధ్య అత్యంత గోప్యంగా చ‌ర్చ సాగుతోంది.

మ‌రి దీనిపై ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి. ఇక‌, పురందేశ్వ‌రి భ‌ర్త ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు హేతువాది అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న స‌తీమ‌ణిగా పురందేశ్వ‌రి కూడా అదే బాట ప‌ట్టి ఉంటారు. అంత‌మాత్రాన పార్టీలో అప్పుడే అగ్గిరాజేయాలా? అనే వాద‌న కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.