పవన్ పై వైవీ హాట్ కామెంట్స్

ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు, హిందూ దేవాలయాలపై, హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. హిందూ ధర్మాన్ని జగన్ టార్గెట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వాలంటీర్ వ్యవస్థ పై చంద్రబాబు పనులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

దేశమంతా వాలంటీర్ల వ్యవస్థను ప్రశంసిస్తోందని సుబ్బారెడ్డి చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా వాలంటీర్లను ప్రశంసించారని గుర్తు చేశారు. ఈ వ్యవస్థను ప్రధాని మోడీ కూడా కొనియాడారని అన్నారు. కరోనా టైంలో ప్రాణాలు అడ్డుపెట్టి మరీ ప్రజలకు వాలంటీర్లు సేవలందించారని చెప్పారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే వాలంటీర్లపై, జగన్ పై పవన్ విమర్శలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవని, వాటి దోపిడీకి తట్టుకోలేక ప్రజలు వైసీపీకి ఓటేశారని అన్నారు. దమ్ముంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని పవన్, చంద్రబాబు ప్రకటించాలని ఛాలెంజ్ చేశారు.

మరోవైపు, పవన్ వ్యాఖ్యలపై మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. జగన్ పై అసూయతో పవన్ మాట్లాడిన ఉపన్యాసాలపై ప్రజలు హర్షించరని అన్నారు. మైక్ చేతిలో ఉందని నోటికొచ్చినట్టు పిచ్చిగా మాట్లాడడం తప్పని, అది తప్ప పవన్ కు రాష్ట్రం గురించి, పాలన గురించి ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. రాబోయే ఎన్నికలే జనసేన, టీడీపీలకు ఆఖరి ఎన్నికలని జోస్యం చెప్పారు. ఈ రెండు పార్టీలను జనం సముద్రంలో కలిపేస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, దాడిశెట్టిల వ్యాఖ్యలపై పవన్ స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.