చిన్న‌మ్మా మ‌జాకా.. జ‌గ‌న్‌పై ఓ రేంజ్‌లో!!

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు, ఎన్టీఆర్ కుమార్తె ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. ఉర‌ఫ్ చిన్న‌మ్మ‌ వైసీపీపైనా.. సీఎం జ‌గ‌న్‌పైనా ఆది నుంచి విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మ‌ళ్లీ ఓ రేంజ్‌లో దుమ్ముదులిపేసింది. కార్యాల‌య‌కు వైసీపీ రంగుల నుంచి ఇళ్ల నిర్మాణం వ‌ర‌కు.. ఉచిత హామీల నుంచి డ‌బ్బుల పందేరం దాకా.. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల నుంచి ఇప్పుడు జ‌రుగుతున్న అప్పుల వ‌ర‌కు కూడా చిన్న‌మ్మ దుమ్ము దులిపేశారు.

తాజాగా ఆదివారం విజ‌య‌వాడ‌లో మాజీ సీఎం న‌ల్లారికిర‌ణ్‌కుమార్‌రెడ్డి, మాజీ చీఫ్ సోము వీర్రాజు స‌హా.. ప‌లువురు నేత‌ల‌తో క‌లిసి.. ప‌దాధికారుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో సుదీర్ఘంగా ప్ర‌సంగించిన పురందేశ్వ‌రి.. వైసీపీ స‌ర్కారు నాలుగేళ్ల పాల‌న‌పై నిప్పులు చెరిగారు. త‌న‌ను రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలిగా నియమించినా.. అందరి సహకారం కావాలని కోరారు. ఎన్నిక‌ల‌కు ఐదారు నెలలే సమయం ఉందని అంద‌రూ జనంలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.

నేడు రాష్ట్రంలో ఎవ‌రూ గుండెల మీద చేయి వేసుకుని ప‌డుకునే పరిస్థితి లేదన్నారు. అన్ని వర్గాల వారు ఆవేదన, ఆందోళనతో ఉన్నారని చెప్పారు. అనేక హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, ఈ హామీలు అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారని, నిజంగా ఈ హామీలు అమలు‌చేశారా అనేది అంశాల వారీగా ప్రజల కు మనం వివ‌రించాల‌ని ఆయ‌న సూచించారు. పది లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలకు పంచుతున్నారని నిప్పులు చెరిగారు. మ‌ద్యం, మైనింగ్ మాఫియాతో కోట్లు దోచుకున్నారని సీఎం జ‌గ‌న్‌పై నేరుగా విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు.

సిఎం నివాసానికి సమీపంలో దళిత మహిళ పై అత్యాచారం జరిగితే నిందితులను పట్టుకోలేదని దుయ్య బ‌ట్టారు. బాలుడిని సజీవ దహనం చేస్తే పట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పై ఆందోళన ఉందని చెప్పారు. వ‌లంటీర్లు పర్మినెంట్ కాదని, వారిని సీఎం జ‌గ‌న్ మోసంచేశా ర‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. ఉన్న పరిశ్రమలు పోయి.. ఉపాధి‌ కోల్పోయారన్నారు.

ఒక పరిశ్రమ ఇక్కడ ఇబ్బందులు చూసి కోయంబత్తూరులో పెట్టుబడి పెట్టిందని పురందేశ్వ‌రి తెలిపారు. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోవడానికి ఇసుక మాఫియానే ప్రధాన కారణమ‌ని పురందేశ్వ‌రి పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ప్రభుత్వం మళ్లించిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం మూడు లక్షల ఇళ్లు కడితే… ‌వాటికి రంగులు వేయడం పైనే వైసిపి ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు.

కేంద్రం అన్ని విధాలా సహకారం ఇచ్చినా అన్నింటినీ పక్కదారి పట్టించారంటూ సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. పార్టీని బలోపేతం చేయడం త‌న‌ ఒక్కరి వల్లే సాధ్యం కాదన్నారు. ప్రతి కార్యకర్త నాకు సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.