ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. యువతను నిర్వీర్యం చేసేందుకే వాలంటీర్ల పోస్టులను జగన్ క్రియేట్ చేశారని రఘురామ మండిపడ్డారు . వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లని ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ఇప్పుడు పవన్ చేస్తున్నారని, అందుకని పవన్ పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం తగదని అన్నారు. వైసీపీ కుటుంబ రాజకీయాల కోసమే వాలంటీర్ల వ్యవస్థను నిర్మించాలని దుయ్యబట్టారు
ఏమీ ఆశించకుండా స్వయంగా సేవ చేసే వారిని వాలంటీర్లు అంటారని, వారికి డబ్బులు ఇస్తారా అని ప్రశ్నించారు. జగన్ తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ నేతలకు నమ్మకం లేదని అందుకే, అంబటి రాయుడితో కూడా ప్రశంసలు కురిపించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారని, ఆయన కూడా భరించారని రఘురామ అన్నారు. వైసీపీ నేతలు అసహ్యంగా దూషించారని, జగన్ కూడా దత్తపుత్రుడు, నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారంటూ విమర్శించారని గుర్తు చేశారు.
ఇన్నాళ్లూ అవన్నీ భరించిన పవన్ ఇక ఓర్పు సహనం నశించి వైసిపి నేతలపై ప్రతిదాడికి దిగారని గుర్తు చేశారు. అందుకే, పవన్ ఇప్పుడు జగన్, జగ్గూభాయ్ అని కౌంటర్ ఇస్తున్నారని, జగన్ కు సీఎం గా ఉండే అర్హత లేదని అంటున్నారని చెప్పుకొచ్చారు. తనకు శత్రువుగా ఉండే అర్హత కూడా జగన్ కు లేదని పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారని ప్రశంసించారు. పవన్ పై కేసులు కూడా లేవని పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం ఆయన వ్యక్తిగత వ్యవహారమని అన్నారు. పవన్ ప్రస్తుతం చూపిస్తోంది టీజర్ అని, రాష్ట్రమంతా తిరిగితే మొత్తం సినిమా చూపిస్తారని అన్నారు.
వైసీపీ మహిళా నేత ఒకరు పవన్ ను సన్నీ లియోన్ తో పోల్చారని రోజాను ఉద్దేశించి రఘురామ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అయితే, సోషల్ మీడియాలో ఆ నటిపై సెటైర్లు వస్తున్నాయని అన్నారు. నేనైతే ఆపేసాను మీరు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో రోజాపై పంచ్ లు వస్తున్నాయని పరోక్షంగా చురకలంటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates