పార్టీ అధినేతపైనా.. పార్టీపైనా.. ఎంత అభిమానం ఉన్నా.. ఎంత ప్రేమ ఉన్నా.. నాయకులు.. చివరకు కోరుకునేది పార్టీలో ఇసుమంత పదవులు.. మరిన్ని టికెట్లు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎవరూ ఈ విషయంలో అతీతులు కారు. రాజకీయాల్లోకి వచ్చింది స్వచ్ఛంద సేవకు కాదని.. టంగుటూరి సమయం లోనే నాయకులు చెప్పుకొన్నారు. ఇప్పుడు మనం దీనిని ఆశించలేం..ఆశించే పరిస్థితి కూడా లేదు.
సో.. ఏ పార్టీలో అయితే టికెట్లు.. పదవులు ఇప్పుడు అత్యంత కీలకం. వైసీపీ, టీడీపీల పరిస్థితి ఎలా ఉన్నా .. ఇప్పుడు జనసేన పరిస్థితి ఆసక్తిగా మారింది. ఎన్నికలకు 8 నెలలు మాత్రమే సమయం ఉండడం, పోరు తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీలు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. మరి ఇంత వేడిగా టికెట్ల వ్యవహారం ఉన్నప్పుడు.. జనసేన ఏం చేయాలి? అనేది నాయకుల ప్రశ్న.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెడతామని చెబుతున్న జనసేనలో ఇప్పటి వరకు ఒక్క టికెట్ కూడా కన్ఫర్మ్ కాలేదు. మహా అయితే.. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ తెనాలి(ఎప్పటి నుంచో పోటీ చేస్తున్న) నుంచి పోటీ చేయొచ్చు. ఇంతకు మించి ఎవరికీ ఒక్క టికెట్ కూడా అధికారికంగా పవన్ కన్ఫర్మ్ చేయలేదు. మరోవైపు సుమారు 20 నియోజకవర్గాలపై నాయకులు దృష్టి పెట్టారు. ఈ టికెట్లు ప్రకటిస్తే.. తమ పని తాను చేసుకుంటామని అంతర్గత సమావేశాల్లో పవన్‌కు చెబుతున్నారు.
ఇదిలావుంటే.. వారాహి యాత్రలు జోరుగా చేస్తున్నప్పటికీ.. ఈ వేదికలపై కూడా పవన్ ఎవరికీ ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. నిజానికి చెప్పాలంటే.. ఈ యాత్ర ద్వారా ఆయన పార్టీని బలోపేతం చేసుకు నేందుకు ప్రయత్నించి ఉండాల్సిందని నాయకులే చెబుతున్నారు. అదేసమయంలో టికెట్ ఆశిస్తు న్నవారు కళ్లముందే కదలాడుతున్నా.. పవన్ వారి భుజం తట్టడం లేదనే వాదనా వినిపిస్తోంది. దీంతో జనసేనలో అంతర్గత అసంతృప్తి పెల్లుబుకుతోంది.
అయితే.. పవన్‌పై అభిమానం.. పార్టీపై నమ్మకంతో ఎవరూ పెదవి విప్పడం లేదు. “మేం పోటీకి సిద్ధంగా ఉన్నాం. అయినా.. మా నాయకుడు ప్రకటించడం లేదు. మేమే అడుగుదామని ప్రయత్నిస్తున్నాం. ఇతర పార్టీలు అన్నీ సిద్ధం చేస్తున్నాయి. మేం ఎవరికీ రూపాయి ఇవ్వం. ఇలాంటప్పుడు ప్రజల్లోకి వెళ్లి మా వైపు తిప్పుకొనేందుకు సమయం సరిపోదు. ఇప్పుడైనా.. కనీసం టికెట్లు ప్రకటిస్తే.. మా పనిమేం చేసుకుంటాం” అని మీడియా మిత్రుల వద్దకొందరు జనసేన నాయకులు చెప్పడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates