ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మొదట్లో ఆరోపణలు ఎదుర్కొన్న కడప ఎంపీ, సీఎం జగన్ స్వయంగా తన సోదరుడు అని చెప్పుకొన్న అవినాష్‌రెడ్డి ఇప్పుడు నిందితుడిగా మారిన విషయం తెలిసిందే. ఈ హత్యను విచారిస్తున్న సీబీఐ అధికారులు మొదట్లో ఆయనను సాక్షిగా పేర్కొన్నారు. అయితే.. తర్వాత కాలంలో దస్తగిరి సహా ఇతర నిందితులను విచారించిన తర్వాత అనూహ్యంగా అవినాష్‌రెడ్డిని కూడా నిందితుడిగా పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఈ దారుణ హత్య కేసులో ఎనిమిది మందిని ప్రధాన నిందితులుగా సీబీఐ పేర్కొనగా వీరిలో ఏ-8 అవినాష్ రెడ్డి కావడం గమనార్హం. ఇక, ఈ కేసు విచారణలో భాగంగా.. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్న అవినాష్ రెడ్డి.. విధిగా ప్రతి శనివారం సీబీఐ విచారణకు మాత్రం హాజరవుతున్నారు. ఈ విచారణ కొనసాగుతోంది. అయితే.. ఇప్పుడు ఉరుములు లేని పిడుగుల మాదిరిగా సీబీఐ కోర్టు నుంచి అవినాష్‌రెడ్డికి పిలుపు వచ్చింది. విచారణ సరే.. ముందు కోర్టుకు రండి! అని సీబీఐ న్యాయస్థానం ఆయనకు సమన్లు పంపించింది.
తాజాగా జారీ చేసిన సమన్లలో వచ్చే నెల(ఆగస్టు) 14న కోర్టుకు స్వయంగా హాజరు కావాలని అవినాష్‌ను ఆదేశించింది. అంతేకాదు.. ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని.. ఎలాంటి పనులు చేయొద్దని.. తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీనికి ముందు కేసును విచారిస్తున్న సీబీఐ.. వివేకా హత్యకు సంబంధించి అడిషినల్ చార్జి షీటును కోర్టులో సమర్పించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. అవినాష్‌రెడ్డికి సమన్లు జారీ చేయడంతోపాటు.. ఆ రోజు ఎలాంటి కారణాలు చెప్పకుండా.. కోర్టుకు రావాలని ఆదేశించడం గమనార్హం.