జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా ఎక్కడా తగ్గడం లేదు. వలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యల తర్వాత.. తెరమీదికి వచ్చిన రోజా.. అప్పటి నుంచి వరుసగా పవన్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పవన్‌పై విరుచుకుపడ్డారు. పవన్ నిజమైన హీరోనేనా? అని రోజా ప్రశ్నించారు. అంతేకాదు.. పవన్ నిజమైన హీరో అయితే.. ఆయన ఒంటరిగా 175 సీట్లలోనూ తన అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేయించాలని రోజా సవాల్ చేశారు. పవన్‌ను పూర్తిగా చంద్రబాబు ఆవహించి ఉన్నారని ఎద్దేవా చేశారు.
రజనీకాంత్ గారి సినిమా అందరికీ తెలుసుగా! చంద్రముఖిలో హీరోయిన్‌ను చంద్రముఖి ఆవహించినట్టు చంద్రబాబు అనే చంద్రముఖి.. పవన్‌ను ఆవహించింది. అందుకే నోటికి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా కామెంట్లు చేస్తున్నాడు. వలంటీర్ వ్యవస్థకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వ్యవస్థను ఉండకుండా చేయాలనేది వీళ్ల కుట్ర అని రోజా వ్యాఖ్యా నించారు. పవన్‌ను చంద్రబాబు ఆడిస్తున్నారన్న రోజా.. నిజమైన హీరో అయితే.. పవన్ వచ్చే ఎన్నికల్లో తన పార్టీ తరఫున 175 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలపాలని ఛాలెంజ్ చేశారు.
పవన్ కళ్యాణ్‌ను ప్రజలు ఎవరూ విశ్వసించడం లేదని రోజా విమర్శలు గుప్పించారు. ఆయనేంటో.. ఆయనను ఎవరు ఆడిస్తున్నారో.. ప్రజలు బాగా అర్థమైందని చెప్పారు. ఒకప్పుడు తన కుటుంబాన్ని తిట్టారని పవన్ కళ్యాణ్ కన్నీరు పెట్టుకున్నాడని.. ఇప్పుడు ఆయన ఎదుటి వారి కుటుంబాలను తిట్టొచ్చా? అని రోజా ప్రశ్నించారు. తుపాకీ పట్టుకుని హైదరాబాద్ వీధుల్లో హల్చల్ చేసిన రోజులు ఎవరూ మరిచిపోలేదని వ్యాఖ్యానించారు. పవన్ వి పిచ్చి డైలాగులేనని.. వాటిని చిన్నపిల్లలు మాత్రమే ఎగబడి వింటున్నారని ఎద్దేవా చేశారు. పవన్‌ను పొలిటికల్ కమెడియన్‌గా రోజా అభివర్ణించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates