ఈసారి బాప‌ట్ల అంత ఈజీ కాదు?

రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇటీవ‌ల కాలంలో ఏం జ‌రిగినా.. సీఎం జ‌గ‌న్ ఆరా తీస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతు న్నాయి. అంటే.. ఒక‌ ర‌కంగా.. చీమ‌ చిటుక్కుమ‌న్నా కూడా ఆయ‌న అలెర్ట్ అవుతున్నారు. మ‌రీ ముఖ్యంగా సొంత పార్టీ నాయ‌కుల విష‌యంలో ఈ అలెర్ట్ ఎక్కువ‌గా ఉంద‌ని చెబుతున్నారు. కీల‌క‌మైన నాయ‌కుల విష‌యంలో సీఎం జ‌గ‌న్ చూసే దృష్టి కోణం కూడా డిఫ‌రెంట్‌గా ఉంద‌ని అంటున్నారు. ఇలా.. సీఎం జ‌గ‌న్ ఒక కీల‌క నాయ‌కుడి విష‌యాన్ని ప‌దే ప‌దే అడుగుతున్న‌ట్టు చెబుతున్నారు.

ఆయ‌నే కోన ర‌ఘుప‌తి. ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీక‌ర్‌. వ‌రుస విజ‌యాలు సాధించిన ఆయ‌న‌కు ఇప్పుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం బాప‌ట్లలో ఎదురు గాలి వీస్తోంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన ర‌ఘుప‌తి.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2014, 2019లో వైసీపీ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్నారు. సీనియ‌ర్‌ నాయ‌కుడిగా, వివాద ర‌హితుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.

ర‌ఘుప‌తి తండ్రి మాజీ గ‌వ‌ర్న‌ర్ కావ‌డం తెలిసిందే. ఇక‌, ఇక్క‌డ టీడీపీ శ్రేణులు చేతులు క‌ల‌ప‌డం కోన‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచేలా చేస్తున్నాయ‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ బాప‌ట్ల‌లో టీడీపీ శ్రేణులు విడిపోయాయి. అంటే.. టికెట్ ఆశించిన వారికి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఓ వ‌ర్గం అలిగింది. 2009లో చిర్ల గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చింది. కానీ.. అదే స‌మ‌యంలో టికెట్ ఆశించిన అన్నం స‌తీష్ వ‌ర్గం.. ఈయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసింది.

దీంతో ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయి.. గాదె వెంక‌ట‌రెడ్డి ఎమ్మెల్యే అయితే.. మంత్రి వ‌ర్గంలోనూ చోటు సంపాయించుకున్నారు. 2014కు వ‌చ్చేస‌రికి.. అన్నం స‌తీష్‌కు టికెట్ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు చిర్ల వ‌ర్గం దూకుడు పెంచి ఈయ‌న‌కు వ్య‌తిరేకంగా టీడీపీని చీల్చేశారు. దీంతో కోన విజ‌యం సాధించారు. ఇక‌, 2019లో టీడీపీ నుంచి వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ అనే పారిశ్రామిక వేత్త టికెట్ కావాల‌ని కోరుకున్నారు. చివ‌రి నిముషం వ‌ర‌కు ఆయ‌న‌ను ఊరించిన టికెట్ చివ‌రి నిముషంలో మ‌ళ్లీ అన్నం ద‌క్కించుకున్నారు.

ఇది కూడా మ‌రోసారి టీడీపీలో వివాదానికి కార‌ణ‌మై… కోన ర‌ఘుప‌తి విజ‌యానికి దారి తీసింది. ఇక‌, ఇప్పుడు మాత్రం ఈ ప‌రిస్థితి లేదు. అన్నం స‌తీష్ గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో వేగేశ్న‌ను ఇంచార్జ్‌గా నియ‌మించారు. దీంతో టీడీపీ అంతా ఏక‌తాటిపైకి చేరింది. ఫ‌లితంగా కోన‌కు మ‌రింత సెగ త‌గులుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ కూడా నిర్ధారించుకున్న‌ట్టు స‌మాచారం.