బెంగుళూరులో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీకి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా బెంగుళూరులో ఈనెల 17,18 తేదీల్లో ప్రతిపక్షాలు సమావేశమవబోతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల సమావేశంలో 24 పార్టీలు పాల్గొనబోతున్నాయి. మొన్నటి పాట్నా సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. రాబోయే సమావేశానికి మరిన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ అనుకుంటోంది. అందుకనే మరిన్ని ప్రతిపక్షాలకు కాంగ్రెస్ తరపున ఆహ్వానాలు అందాయి.
సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే రెండు రోజుల పర్యటన నిమ్మితం సోనియా బెంగుళూకు వస్తున్నారు. ఇదే సమయంలో 17వ తేదీ రాత్రి విపక్షాల విందుకు షర్మిలను కూడా ఆహ్వానించే అవకాశాలున్నట్లు ప్రచారం మొదలైంది. షర్మిల తరపున కాంగ్రెస్ అధిష్టానంతో కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపి విలీనం చేసేయాలని మొదట డీకేనే షర్మిలకు సూచించారు. అయితే విలీనం తర్వాత పరిణామాలపైనే ఇంకా ఒక నిర్ణయం జరగలేదు.
షర్మిలేమో కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం విలీనంపైనే దృష్టిపెట్టిందట. ఈ విషయం ఎటూ తెగని కారణంగానే ఇఫ్పటికి డీకే-షర్మిల మూడుసార్లు భేటీ అయ్యారు. షర్మిల పార్టీని విలీనంచేసుకుని ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించిందనే టాక్ అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో తాను తెలంగాణాను విడిచి వెళ్ళేదిలేదని, తన భవిష్యత్తంతా తెలంగాణాతో మాత్రమే ముడిపడుందని షర్మిల గట్టిగా చెబుతున్నారు.
ఈ నేపధ్యంలోనే ఫైనల్ గా సోనియాతో షర్మిల బెంగుళూరులో భేటీ అయ్యే అవకాశముందని సమాచారం. షర్మిల తెలంగాణా కాంగ్రెస్ లో చేరికపై పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే రేవంత్ అభ్యంతరాలను అధిష్టానం పెద్దగా పట్టించుకునేట్లు లేదు. ఎందుకంటే ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా అంతిమ నిర్ణయం తనిష్టప్రకారమే అధిష్టానం తీసుకుంటుంది. బెంగుళూరు సమావేశాలకు లేదా విందు సమావేశానికి షర్మిల హాజరైతే విలీనమా ? పొత్తా ? అన్నది ఏదో ఒకటి తేలిపోవటం మాత్రం ఖాయమనే అనుకోవాలి. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.