ఏలూరు బహిరంగ సభలో వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
వాలంటీర్ల పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు డ్యామేజీ కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తారనుకున్న పవన్… తాజాగా మరోసారి వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు ఐదు వేల జీతమిచ్చి జనాల ఇళ్లలో దూరే అవకాశమిచ్చారని పవన్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.
వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడకు వెళుతోందని? అంత సున్నితమైన సమాచారం వేరే వాళ్ళ చేతులలోకి వెళ్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలను అదుపు చేయడానికి వాలంటీర్ల వ్యవస్థను తెచ్చారని, కొన్నిచోట్ల ప్రజలను వాలంటీర్లు బెదిరిస్తున్న ఘటనలున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.
అయితే, తాను అందరు వాలంటీర్లను అనడం లేదని, వారి పొట్ట కొట్టడం తన ఉద్దేశం కాదని చెప్పారు. 100 పండ్లలో ఒకటి కుళ్ళినా మిగతావి కూడా కుళ్ళిపోతాయని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 5 వేలతో వాలంటీర్లను ఉపయోగించుకొని ఊడిగం చేయిస్తున్నారని, నిరుద్యోగం పెరిగితేనే డిగ్రీ చదివిన వాళ్ళు ఐదువేలకు పనిచేస్తున్నారని అన్నారు.
వాలంటీర్లతో వెట్టిచాకిరి చేయిస్తున్న జగన్.. క్లాస్ వరకు గురించి మాట్లాడుతున్నారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పార్టీ వారు వాలంటీర్ వ్యవస్థపై కన్నేసి ఉంచాలని పవన్ చెప్పారు. వారు తమ పని తాము చేస్తే ఎవరికీ ఇబ్బంది లేదని, వైసీపీకి మాత్రమే పనిచేస్తామంటే మాత్రం ప్రజలు ప్రశ్నించాలని అన్నారు.
ఆడపిల్లలు ఉన్న కుటుంబాలు వాలంటీర్ వ్యవస్థ పై అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా మీ డేటా వారికి ఇవ్వొద్దని సూచించారు. ఒంటరి మహిళలు, వితంతువులు భద్రంగా ఉన్నారా లేదా అని పరిశీలించాలని, మహిళల మిస్సింగ్ పై కేంద్ర సంస్థలు అధ్యయనం చేస్తున్నాయని అన్నారు.