ఇద్ద‌రు సీనియ‌ర్లు.. ఇంత దిగ‌జారుడా? తెలంగాణ టాక్‌

వారిద్ద‌రూ సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు. ఇంకో మాట‌లో చెప్పాలంటే.. త‌ల‌పండిపోయార‌నే చెప్పాలి. నేటి రాజ‌కీయ యువ‌త‌కు వారు దిశానిర్దేశంగా నిల‌వాల్సిన త‌రుణం. కొత్త త‌రం నేత‌ల‌ను చెయ్యి ప‌ట్టుకుని న‌డిపించాల్సిన స్థానంలో ఉన్నారు. కానీ, అదే కొత్త‌.. అదే పాత త‌రం నాయ‌కుల నుంచి ప్ర‌జ‌ల వ‌ర‌కు చీద‌రించుకునే స్థాయికి దిగ‌జారిపోయారు. కేవ‌లం ఎమ్మెల్యే టికెట్ కోసం.. అత్యంత హీనంగా రోడ్డున ప‌డ్డార‌ని నెటిజ‌న్లు స‌హా ప్ర‌జ‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

వారే.. స్టేష‌న్ ఘ‌నపూర్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం రాజ‌య్య‌, ఇదే నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి. ఇద్ద‌రూ కూడా కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. కానీ, ఆ గౌర‌వాన్ని.. ఆ హుందా త‌నాన్ని వారివురూ మ‌రిచిపోయార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. రాజ‌కీయా ల్లో ఒక‌ప్పుడు విమ‌ర్శించుకున్నా.. తిట్టుకున్నా కూడా.. హుందాత‌నం ఉండేది. ఈ విష‌యం వీరికి కూడా తెలుసు.

పోనీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా మారార‌ని అనుకున్నా.. వ్య‌క్తిగ‌త విష‌యాల వ‌ర‌కు ఫ‌ర్వాలేదు. కానీ.. ఏకంగా.. పుట్టుక‌ల వ‌ర‌కు నోరు పారేసుకోవ‌డం.. పుట్టుక‌ల‌నే ప్ర‌శ్నార్థ‌కం చేసేలా ఎదురుప‌క్షంపై విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం.. మాతృదేవోభవ‌, పితృదేవోభవ‌.. అని స‌మాజానికి దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉన్న‌వారు అదే మాతృదేవ‌త‌కు, అదే పితృదేవ‌త‌కు త‌ల‌వంపులు తెచ్చేలా.. పుట్టుక‌ల‌ను ప్ర‌శ్నించుకోవడం అత్యంత జుగుప్సాక‌రంగా ఉంద‌ని సామాన్య ప్రజానీకం కూడా త‌ల‌ప‌ట్టుకుంటున్నారు.

తాజాగా రాజ‌య్య‌.. త‌ర్వాత క‌డియం.. ఒక‌రి పుట్టుక‌పై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుని న‌డిరోడ్డుపై త‌ప్ప‌తాగిన వ్య‌క్తులు తిట్టుకునేలా వ్య‌వ‌హ‌రించార‌నే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. రేప‌టి కోసం మీరు చెప్పే సందేశాలు ఇవేనా? అని నెటిజ‌న్లు దెప్పి పొడుస్తున్నారు. కేవ‌లం ఎమ్మెల్యే సీటు కోసం ఇంత‌గా క‌ని పెంచిన వారిని .. జీవితాన్ని ఇచ్చిన వారిని కూడా రోడ్డున ప‌డేసుకోవాలా? ప‌విత్ర‌మైన త‌ల్లిత‌నాన్ని.. తండ్రిత‌నాన్ని కూడా రాజ‌కీయాల‌కు వాడుకోవాలా? అని నిప్పులు చెరుగుతున్నారు.