రాజకీయాల్లో లాభపడడం ఎంత ముఖ్యంగా ప్రత్యర్థికి నష్టం కలిగించడం కూడా అంతే ముఖ్యం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరిగ్గా అదే పనిచేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఆయువు పట్టులాంటి వాలంటీర్ల వ్యవస్థపై అదను చూసి దెబ్బకొట్టారు. వాలంటీర్లను చూడగానే ప్రజలు దడుచుకునేలా షాకింగ్ కామెంట్లు చేశారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతోనే తాను ఈ సత్యం చెప్తున్నానని.. రాష్ట్రంలో వేలమంది అమ్మాయిలు, ఒంటరి మహిళలు మిస్సవ్వడానికి కారణం వాలంటీర్లేనంటూ అత్యంత తీవ్రమైన ఆరోపణ చేశారు.
50 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించడంతో వారు వ్యక్తుల వ్యక్తిగత జీవితంలోకి చొరబడి ఆ సమాచారం సంఘ విద్రోహక శక్తులకు చేరవేస్తున్నారని పవన్ ఆరోపించారు. పవన్ చేసిన ఆరోపణతో, ఆయన అత్యంత బలంగా చెప్పిన విషయంతో ఏపీ ప్రజలు ఇక వాలంటీర్లను చూస్తే సీసీ కెమేరాను చూసినంతగా.. కిడ్నాపర్‌ను చూసినంతగా.. పిల్లలను ఎత్తుకుపోయేవాళ్లను చూసినంతగా భయపడే పరిస్థితి కల్పించారు.
‘వాలంటీర్లు ప్రతి ఊళ్లో ఎవరు ఏ పార్టీ మనిషి.. ఏ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు.. అమ్మాయిలు ఎవరినైనా ప్రేమిస్తుంటే ఆ విషయం.. వితంతువులు.. ఒంటరి మహిళలు.. ఎవరికి ఎలాంటి లోపాలున్నాయి.. ఎలాంటి అలవాట్లున్నాయి వంటి సమాచారం అంతా సంఘ విద్రోహక శక్తులకు చేరవేస్తున్నారు. దాని ప్రకారం హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది’ అంటూ పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
నిజానికి వాలంటీర్ల వ్యవస్థ అనేది వైసీపీ ప్రభుత్వ నిఘా వ్యవస్థ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, అదంతా రాజకీయం వరకే అనుకున్నారు ప్రజలంతా. కానీ.. ఇప్పుడు పవన్ ఇలా అమ్మాయిల ప్రేమ వ్యవహారాలు, ఊళ్లలో అక్రమ సంబంధాలు, భర్త లేని వితంతువులు వంటి డాటా గురించి కూడా మాట్లాడడంతో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లపై ఒక్కసారిగా అనుమానం పెరిగింది. పైగా ఇప్పటికే వివిధ జిల్లాలలో వాలంటీర్లు మహిళల విషయంలో చేసిన కొన్ని పనులు కూడా ప్రజలకు తెలియడంతో దానికి పవన్ మాటలు ఊతమిచ్చినట్లయింది. దీంతో వాలంటీర్లు ఇకపై జగన్‌కు రాజకీయ ప్రయోజనం కల్పించేలా ఇళ్లలోకి చొచ్చుకుపోయే పరిస్థితి ఉండకపోవచ్చు.
చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థపై గతంలో కామెంట్లు చేసినా పవన్ కల్యాణ్ తరహాలో ఇంత తీవ్రమైన, జనానికి నేరుగా కనెక్టయ్యే విషయం చెప్పలేకపోయారు. పవన్ చేసిన తాజా ఆరోపణలు వైసీపీకి తీవ్ర నష్టం కలిగించేవే. అందుకే… పవన్ కామెంట్లు చేసిన మరుక్షణమే వైసీపీ నుంచి ఎదురుదాడి మొదలైంది. అంతేకాద… రాంగోపాల్ వర్మ వంటి థర్డ్ పార్టీలు కూడా ఇందులోకి ఎంటరై వాలంటీర్లు పవన్‌పై కేసులు పెట్టాలంటూ వారిని రెచ్చగొట్టారు.
అయితే.. వైసీపీ ఎంత డిఫెన్స్ చేసుకున్నా రాంగోపాల్ వర్మ వంటివారు వాలంటీర్లను రెచ్చగొట్టినా జరగాల్సింది జరిగిపోయింది. పవన్ చేసిన ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates