“బుగ్గలు నిమిరేవారిని.. తలపై చెయ్యి పెట్టేవారిని నమ్మారు. ఇప్పుడు ఏమైంది. అలాంటివారిని నమ్మడం కాదు.. మాటపై నిలబడేవారిని నమ్మండి. వారికి ఓటేయండి!” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వారాహి 2.0 యాత్రలో భాగంగా ఆయన ఏలూరులో ఆదివారం రాత్రి నిర్వహించిన సభలో వైసీపీ సర్కారుపైనా.. సీఎం జగన్‌పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదేసమయంలో ఎన్నికల సమయంలో ప్రజలు కూడా మారాలంటూ హితవు పలికారు. మాయ మాటలు చెప్పి.. బుగ్గలునిమిరే వారికి ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు.
“రాజకీయాల్లో విలువలు నిలబెట్టేలా నేను మాట్లాడుతుంటే అధికార పార్టీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు. నన్ను వ్యక్తిగతంగా దూషిస్తూ.. నా కుటుంబంపై అనరాని మాటలు అంటున్నారు. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. జగన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను. కానీ.. ఇప్పటి నుంచి నేను ఏంటో చూపిస్తా. అప్పుడు తెలుస్తుంది వైసీపీ నేతలకు” అని పవన్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి చాలా కీలకమన్న పవన్.. విద్య, వైద్యం, ఉపాధి కల్పించే వరకు ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. కొల్లేరు కలుషితమవుతోందని, సంరక్షించే బాధ్యత తాము తీసుకుంటామని వ్యాఖ్యానించారు. 115 ఏళ్లనాటి కృష్ణా జ్యూట్‌మిల్లు వైసీపీ పాలనలో మూతబడిందని విమర్శించారు.
ఆ యువతులు ఏమయ్యారు?
రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరుగుతోందని పవన్ అన్నారు. ముఖ్యంగా 30 వేల మంది యువతులు నాలుగేళ్లలో అదృశ్యమయ్యారని.. మానవ అక్రమ రవాణాకు కారణం.. వైసీపీ వలంటీరు వ్యవస్తేనని వ్యాఖ్యానించారు ఇందులో వైసీపీ నేతల పాత్ర ఉందని నిఘా వర్గాలే చెప్పాయన్నారు. యువతుల అదృశ్యంపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు. సీఎం సహా ఒక్కో ఎమ్మెల్యే వందల కోట్లు దోచేస్తున్నారని మండిపడ్డారు.
“హలో ఏపీ.. బైబై వైసీపీ” ఇదే తమ నినాదమని పవన్ కళ్యాణ్ చెప్పారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న జగన్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదన్నారు. పదవి నుంచి దిగిపోగానే జగన్‌ను వాడవాడలా వెంటాడతామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రభుత్వం మారాలని చెప్పారు. ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates