జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముద్రగడ వైసీపీ తరఫున బరిలో దిగుతున్నారని, అందుకే పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే దమ్ముంటే తనపై పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలని ముద్రగడ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ముద్రగడపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ వైసీపీలో చేరితే స్వాగతిస్తామని, ఆయన చేరికతో వైసీపీ మరింత బలోపేతం అవుతుందని మిథున్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.
ముద్రగడ గొప్ప నాయకుడని మిథున్ రెడ్డి కొనియాడారు. సీనియర్ లీడర్, పెద్దలు అయినటు ముద్రగడ వైసీపీలోకి వస్తానంటే తప్పకుండా ఆహ్వానిస్తామని అన్నారు. అయితే, ఈ విషయంపై ముద్రగడ గారు, ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని మిథున్ రెడ్డి చెప్పారు. పవన్ సీఎం సీటుపై ఆసక్తి ఉందని కాసేపు, లేదని కాసేపు అంటున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు, ప్రస్తుతానికి తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే ఆలోచన లేదని వైసీపీ నేతలతో ముద్రగడ అన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు, పవన్ వారాహి యాత్రకు ముందు రోజు లేదా యాత్ర చేసే రోజు కావాలనే ముద్రగడ టాపిక్ ను వైసీపీ నేతలు తెరపైకి తెస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సరిగ్గా ఏలూరులో పవన్ కళ్యాణ్ యాత్ర మొదటి రోజే మిథున్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో కూడా వారాహి యాత్ర తొలి విడత ప్రారంభం కావడానికి ముందు రోజు జూన్ 9వ తేదీన ముద్రగడను వైసీపీ నేతలు కొందరు కలిశారు.
కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వైసీపీ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వెళ్లి పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. తాజాగా రెండో విడత వారాహి యాత్ర మొదలు కాబోతున్న నేపథ్యంలో మరోసారి పవన్ ను ముద్రగడ టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తారా అన్నది తేలాల్సి ఉంది. వారాహి యాత్రను బలహీనపరచడానికి ముద్రగడను వైసీపీ నేతలు వాడుకుంటున్నారని, ఈ క్రమంలోనే సరిగ్గా వారాహి యాత్ర మొదలు కావడానికి ముందే ముద్రగడ టాపిక్ ను తెరపైకి తెస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.