ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తుల అంశం హాట్ టాపిక్. వైఎస్సార్ కాంగ్రెస్ ఎప్పట్లాగే ఒంటరిగా పోటీ చేయడం కన్ఫమ్. ఆ పార్టీ ఎప్పుడూ కూడా ఏ పార్టీతోనూ కలిసి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఆ పార్టీ వ్యవహారమంతా వేరు కాబట్టి.. దాంతో కలిసి వెళ్లేందుకు వేరే పార్టీలు కూడా ఎప్పుడూ ఆసక్తి చూపవు.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో జనసేన ఈ సారి కలిసి బరిలోకి దిగడం ఖాయమనే అంతా అనుకుంటున్నారు. ఈ దిశగా ఇటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారు.
ఐతే ఆయా పార్టీలో మెజారిటీ వర్గాలు ఇందుకు అనుకూలంగానే ఉన్నప్పటికీ.. పొత్తు వద్దనే వాళ్లు కూడా లేకపోలేదు. సోలోగా వెళ్తేనే పార్టీకి మంచి ఫలితాలుంటాయని.. పొత్తు వద్దని బలంగా వ్యాఖ్యానిస్తున్న వాళ్లు రెండు పార్టీల్లోనూ ఉన్నారు. ఈ విషయంలో వాదోపవాదాలు కూడా నడుస్తున్నాయి.
టీవీ చర్చల్లో, మీడియాలో పొత్తుల గురించి కొందరు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు కూడా దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి యాత్ర ముంగిట పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పొత్తుల గురించి ఎవ్వరూ మాట్లాడొద్దని ఆయన తేల్చి చెప్పారు. పొత్తుల గురించి మాట్లాడే సమయం ఇది కాదని.. అందుకు ఇంకా చాలా టైం ఉందని పవన్ వ్యాఖ్యానించాడు.
రెండు వారాలు జరిగిన వారాహి యాత్ర గురించే ఎంతో ఫీడ్ బ్యాక్ తీసుకున్న తాను.. పొత్తుల విషయంలో ఇంకెంత ఫీడ్ బ్యాక్ తీసుకుంటానో, ఎంత లోతుగా చర్చిస్తానో పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని పవన్ అన్నాడు. మండలాలు, నియోజకవర్గాల వారీగా కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని.. జనం అభిప్రాయం తీసుకుని.. లోతుగా అధ్యయనం చేశాక కానీ పొత్తులపై తుది నిర్ణయం తీసుకోమని పవన్ స్పష్టం చేశాడు. కాబట్టి ఇప్పుడే పార్టీ నేతలు టీవీ చర్చల్లో, వేరే చోట పొత్తుల గురించి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం తప్పదని.. కాబట్టి అందరూ ఈ విషయం గుర్తుంచుకోవాలని పవన్ హెచ్చరించారు.