వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల తాజాగా శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పాలేరులో ఏర్పాటు చేసిన సభలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పక్కాగా పోటీ చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే, తాను గతంలో చెప్పినట్లే.. పాలేరు నుంచే పోటీ చేస్తానని షర్మిల పేర్కొన్నారు. “ఇదే పాలేరు మట్టి సాక్షిగా పాలేరు ప్రజలకు వైయస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని మాటిచ్చాను. రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీ రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీలతో రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకొస్తానని చెప్పాను” అని షర్మిల వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో తాను వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తానని.. అసెంబ్లీలో అడుగు పెడతానని.. తనను ఓడించాలని కొందరు కుయుక్తులు పన్నుతున్నారని.. దమ్ముంటే ఓడించాలని ఆమె సవాల్ రువ్వారు. “మళ్లీ చెబుతున్నా.. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తా” అని షర్మిల పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాటిస్తున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని గుర్తు చేశౄరు. అతికొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ పాదయాత్రను పాలేరులో ప్రారంభించి 4000 కిలో మీటర్లు పూర్తి చేసి పాలేరులోనే ముగిస్తానని షర్మిల ప్రకటించారు.
పాలేరే ఎందుకంటే.. షర్మిల వ్యూహం ఇదే
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంపై దృష్టి సారించిన షర్మిల.. పూర్తి స్థాయిలో అక్కడి నుంచే పొలిటికల్ కార్యకలాపాలను నిర్వహించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇక, ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దక్కించుకుంది. కాంగ్రెస్ తరఫున గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి.. తర్వాత.. టీఆర్ ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఒకరకంగా చెప్పాలంటే పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి లేరు. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా షర్మిల ఈ స్థానాన్ని ఎంచుకున్నారనే చర్చ సాగుతోంది. మరో వైపు .. షర్మిల కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశం లేదా.. పార్టీని విలీనం చేసే అవకాశం ఉన్న దరిమిలా.. కాంగ్రెస్ కూడా ఇక్కడ మరెవరినీ నిలబెట్టే చాన్స్ లేదనే చర్చ సాగుతోంది.