వైసీపీది ‘ముందస్తు’ డ్రామా:బాబు

ఏపీలో ముందస్తు ఎన్నికలపై జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో జగన్ ముందస్తు ఎన్నికల గురించి దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

జగన్ ను ప్రజలు ఎన్నుకున్నారని, ఐదేళ్లపాటు ఆయన అధికారంలో ఉంటారని సజ్జల చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలపై వైసీపీ నేతలది తప్పుడు ప్రచారమని, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందస్తు ఎన్నికలు అంటూ మీడియాకు వైసీపీ నేతలే లీకులిస్తున్నారని, ఆ తర్వాత ఆ లీకులను ఖండించి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అంటూ ప్రతిపక్షాలను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.

ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి టీడీపీ సిద్ధంగా ఉందని, అయితే, ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత త్వరగా జగన్ ఇంటికి వెళతారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలలో వైసీపీని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మరోవైపు, ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు జిల్లాల పర్యటనను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు నుంచి ఎన్నికల ప్రచారం కూడా మొదలుబెట్టే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.