ఏపీ సీఎం జగన్ కేంద్రంగా టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణలు మాటల తూటాలు పేల్చారు. జగన్‌పై అశోక్ గజపతి రాజు చేసిన ఘాటు విమర్శలకు అంతే ఘాటుగా బొత్స సత్యనారాయణ కూడా.. సమాధానం ఇచ్చారు. దీంతో విజయనగరం పాలిటిక్స్‌లో హాట్ ఎట్మాస్ఫియర్ ఏర్పడింది.
అశోక్ ఏమన్నారంటే..
”చంచల్ గూడ జైలు నుంచి ఉత్తర కోస్తా జిల్లాలకు జగన్ రెడ్డి ట్రాన్సఫర్ పెట్టుకున్నారు. జైల్లో చిప్ప కూడున్న తిన్న దొంగను మనం ఆంధ్రాకు ముఖ్యమంత్రిని చేసేశాం. అభివృద్ధి చేసేశాం అని చెబుతున్న వైసీపీ నేతల చేష్టలు ఏంటో మనకు తెలియవా.!” అని అశోక్‌గజపతిరాజు విమర్శించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి, 16 నెలలు జైల్లో ఉన్న దొంగను ముఖ్యమంత్రి చేసిన రాష్ట్ర ప్రజలంతా నేడు నరకాన్ని చూస్తున్నారని అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఒక్క చాన్స్ అంటూ తండ్రి ఫొటోను అడ్డం పెట్టుకుని వచ్చిన ఆయన నేడు అన్నివర్గాల ప్రజలకు నరకం చూపిస్తున్నారని దుయ్యబట్టారు. బెయిల్‌పై చంచల్‌గుడా జైలు నుంచి వచ్చిన ఆయన తిరిగి విశాఖ జైలుకు వెళ్లేందుకు సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్‌రెడ్డి ప్రధాని మోడీ కాళ్లముందు మెడలు వంచడం ద్వారా తెలుగుజాతి గౌరవాన్ని మంటకలుపుతున్నారని విమర్శించారు.
బొత్స కూడా తగ్గలేదు!
సీఎం జగన్ కేంద్రంగా అశోక్ గజపతి రాజుచేసిన ఘాటు వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సమాజానికే జగన్ అంకితమయ్యారని చెప్పారు. సమాజం ఆలోచననే జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. సీనియర్ నాయకుడు గజపతి రాజు మాట్లాడేటప్పుడు వెనుకా ముందూ ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. తమకు వ్యక్తిగత ద్వేషాలు ఉండవని, సీఎం జగన్ కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నారని చెప్పారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్న గజపతి రాజు..గల్లీ నేతగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.