నిజామాబాద్ జిల్లాలో హీరో నితిన్ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారని, వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో పాలక బీఆర్ఎస్‌లో కంగారు మొదలైంది. అదే సమయంలో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు కూడా తమ సీటుకు ఎక్కడ ఎసరొస్తుందోనని భయపడుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో కాంగ్రెస్‌లోని కొందరు నేతలలో కంగారు మొదలైంది.
తెలంగాణకు చెందిన యువ హీరో నితిన్‌కు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొద్దినెలల కిందట బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి తెలంగాణకు వచ్చినప్పుడు నితిన్‌తో భేటీ అయ్యారు. దాంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారని అప్పట్లోనే ప్రచారమైంది. అయితే.. అనూహ్యంగా కాంగ్రెస్ నేతలు ఆయన్ను సంప్రదించారని.. ఆయన కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంపై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.
అయితే, నితిన్ ఎక్కడనుంచి పోటీ చేస్తారనే విషయంలో ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. నితిన్ స్వస్థలం నిజామాబాద్ కావడంతో ఆయన నిజామాబాద్ రూరల్ నుంచి కానీ అర్బన్ నుంచి కానీ అసెంబ్లీకి పోటీ చేస్తారని భావిస్తున్నారు. అయితే.. ఆయన ఎక్కడి నుంచి పోటీచేసినా విజయం సాధిస్తారని బీఆర్ఎస్ వర్గాలు లోలోన ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లో చాలామంది నేతలు నితిన్ వస్తే అది పార్టీకి లాభమే అని భావిస్తుండగా టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు మాత్రం టెన్షన్ పడుతున్నారు.
ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్సీ, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన అరికెల నర్సారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నితిన్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఆయనకు అంత సీన్ లేదని అన్నారు. ప్రజల్లో ఉన్నవారికే టికెట్లు వస్తాయని.. ప్రజలు కూడా ఆదరిస్తారని అన్నారు. నితిన్ పార్టీలో చేరితే తనకు టికెట్ అవకాశం కష్టమన్న ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెప్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates