ఏదీ ఆ జోష్‌.. వైసీపీలో కుమ్ములాట‌లే కార‌ణ‌మా..?

YSR

వైసీపీలో కుమ్ములాట‌లు.. ఆత్మ స్థ‌యిర్యం కోల్పోతున్న వైనం స్ప‌ష్టంగా తెర‌మీదికి వ‌చ్చింది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు త‌మ‌కు టికెట్ వ‌స్తుందో రాదో అనే భ‌యం వెంటాడుతోంది. ఈ క్ర‌మంలో వారు.. ఎవ‌రికివారే మౌనంగా ఉంటున్నారు. ఇది.. ఏకంగా.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి కార్య‌క్ర‌మంపై ప్ర‌భావం చూపించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. శ‌నివారం(జూలై 8) వైఎస్ జ‌యంతి. కానీ, ఎక్క‌డా ఆ జోష్ క‌నిపించ‌డం లేదు.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన తొలి మూడేళ్ల‌పాటు వైఎస్ జ‌యంతిని రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులు ఘ‌నంగా నిర్వ‌హించారు. కొన్ని చోట్ల పేద‌ల‌కు అన్న‌దానాలు కూడా చేశారు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా.. వైఎస్ కీర్తిని కూడా ప్ర‌చారం చేశారు. అయితే.. అనూహ్యంగా ఈ ఏడాది ఎక్క‌డా అలాంటి సంబ‌రాలు ఏవీ క‌నిపించ డం లేదు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. య‌థావిథిగా.. త‌న తండ్రి ఘాట్‌కు వెళ్లిపోయారు. పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తున్నారు.

మ‌రి క్షేత్ర‌స్థాయిలో వైఎస్ జ‌యంతిని ఎవ‌రు నిర్వ‌హించాలి? అనే ప్ర‌శ్న‌కు మాత్రం నాయ‌కుల నుంచి ఎలాంటి ఆన్స‌ర్ క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. మీరు చేస్తారంటే.. మీరు చేస్తారులే.. అని నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు ఆరోపించుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కానీ, ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.. వైఎస్ జ‌యంతిని నిర్వ‌హించ‌డ‌మూ లేదు. మ‌రోవైపు.. ఇంకొంద‌రు నాయ‌కులు తెలివి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఉచితంగా వ‌చ్చే సోష‌ల్ మీడియాలో వైఎస్ ఎంబ్ల‌మ్‌లు రూపొందించి.. వాటిపై త‌మ ఫొటోలు వేసుకుని.. నివాళుల‌ర్పిస్తున్న‌ట్టు.. జయంతిని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న‌ట్టు ప్ర‌చారం చేస్తున్నారు. అంటే.. వీరు వైఎస్ ను ఒక ర‌కంగా.. సోష‌ల్ మీడియాకే ప‌రిమితం చేసిన‌ట్టు అయింది. ఇక‌, సీమ‌లోని ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు మాత్ర‌మే త‌మ సొంత కార్యాల‌యాల్లో వైఎస్ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించారు. సో.. మొత్తంగా చూసుకుంటే.. వైసీపీలో వైఎస్ జోష్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.