ఎన్నికల వేడి పెరిగిపోతున్న కొద్ది వివిధ సామాజికవర్గాలు ఎక్కువ టికెట్లు సాధించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీలో ఇపుడీ విషయమే హాట్ టాపిక్కుగా మారింది. కాంగ్రెస్ లోని బీసీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో మాజీ ఎంపీ వీ హనుమంతరావు తదితరులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీసీల జనాభా ఆధారంగా సముచితమైన స్ధానాలు కేటాయించాల్సిందే అని తీర్మానించారు.
వీలైనన్ని ఎక్కువ టికెట్లు పొందేందుకు బీసీ సామాజికవర్గంకు చెందిన నేతలంతా ఏకతాటిపైకి రావాలని తీర్మానించారు. సమావేశంలో చర్చించిన వివరాల ప్రకారం 45 నియోజకవర్గాల్లో 55-70 శాతం మధ్యలో బీసీల ఓట్లున్నాయట. కాబట్టి బీసీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తే అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చని అనుకున్నారు. అందుకనే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లుపోను మిగిలిన నియోజకవర్గాల్లో తక్కువలో తక్కువ 47 అసెంబ్లీ నియోజకవర్గాలను బీసీలకు కేటాయించేట్లుగా పీసీపీతో పాటు ఏఐసీసీ మీద ఒత్తిడి తేవాలని డిసైడ్ అయ్యింది.
2014 ఎన్నికల్లో బీసీలకు 31 నియోజకవర్గాల్లో టికెట్లిచ్చింది అధిష్టానం. అలాగే 2018 ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లు దక్కుతాయని అనుకుంటే దక్కింది 24 మాత్రమే. జనాభా దామాషా ప్రకారం బీసీలకు తగినన్ని టికెట్లు ఇవ్వలేదని అప్పట్లో గోలజరిగింది. అయినా అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. అందుకనే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే బీసీ నేతలంతా ఇపుడే సమావేశమయ్యారు. బీసీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల జాబితాను రెడీ చేస్తున్నారు.
ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ బీసీ మంత్రాన్ని జపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ కూడా బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తే అధికారంలోకి రావటం ఖాయమని బీసీ నేతలు గట్టిగా చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మంచి జోరుమీదున్నది కాబట్టి బీసీ ఓట్లు కమలంపార్టీకి పడతాయని అనుకున్నారు. కానీ సడెన్ గా బండిని మార్చేసి కిషన్ రెడ్డిని నియమించటంతో బీజేపీ వైపు వెళతాయన్న బీసీ ఓట్లను కాంగ్రెస్ వైపుకు లాక్కోవచ్చని అంచనా వేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.