ఒక్క శాతం ఓట్ల కోసం నాలుగు పార్టీల కుస్తీ..!

రాష్ట్రంలో ఒక్క‌శాతం ఓట్ల కోసం.. నాలుగు పార్టీలు కుస్తీప‌డుతున్నాయ‌ని స‌ర్వేలు చాటి చెబుతున్నాయి. పార్టీల‌కు అతీతంగా చేస్తున్న స‌ర్వేల్లో కీల‌క విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు సుమారు 98.2 శాతం వ‌ర‌కు ఓట్లు షేర్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అది ఓట‌ర్లు వ‌చ్చే దానిని బ‌ట్టి ఆధార‌ప‌డుతుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. ఒక‌వేళ ఎన్నిక‌ల స‌మ‌యానికి ఓట‌ర్లు పోటెత్తినా.. ఈ లెక్క‌లో పెద్ద‌గా తేడా ఉండేది లేద‌ని చెబుతున్నారు.

ఇక‌, మిగిలిన 1.8 / 1.5 శాతం ఓట్ల విష‌యానికి వ‌స్తే.. వీటిని ఇత‌రుల‌కు వేసే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వే సంస్థ‌లు చెబుతున్నాయి. ఆ ఇత‌రుల్లో నాలుగు పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ, క‌మ్యూనిస్టులు, ఆప్ / బీఎస్పీ. వీటి మ‌ధ్యే ఆ ఒక్క శాతం ఓట్లు షేర్ అవుతార‌ని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే.. ఒక్క‌శాతం ఓటు బ్యాంకు కోసమే ఈ నాలుగు పార్టీలు కుస్తీప‌డుతున్న‌ట్టు చెబుతున్నాయి. వీటిలో ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏ పార్టీ పుంజుకునే అవ‌కాశం ఉంటే.. ఆ పార్టీ వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతార‌ని కూడా లెక్క‌లు తేల్చాయి.

ఇక‌, కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే.. ఇద్ద‌రు పీసీసీ ప్రెసిడెంట్‌లు మారినా.. పార్టీ ప‌రిస్థితిలో మార్పు రాలేద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. నిజానికి ర‌ఘువీరారెడ్డి ఉండి ఉంటే.. అంతో ఇంతో పుంజుకుని ఉండేద‌ని కూడా చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న పీసీసీ చీఫ్ రుద్ర‌రాజు వ‌ల్ల పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఒక మెట్టు కూడా ఎక్క‌లేక పోయింద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో బీజేపీ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని అంటున్నారు.

అయితే.. ప్ర‌స్తుతం పార్టీచీఫ్ మారిన నేప‌థ్యంలో ఏమైనా తేడా క‌నిపిస్తుందేమో చూడాల‌ని అనే ప‌రిస్థితు లు ఉన్నాయి. ఎంత‌గా ప‌రిస్థితి మారినా గెలిచే వ‌ర‌కు నాయ‌కుల‌ను ప్రోత్స‌హించ‌డం.. పూర్తిస్థాయిలో పార్టీని పుంజుకునేలా చేయ‌డం ఈ 9 నెల‌ల కాలంలో సాధ్య‌మ‌య్యేనా? అనేది ప్ర‌శ్న. మ‌రోవైపు ఉద్య‌మాల బాట‌తో ముందుకు సాగుతున్న క‌మ్యూనిస్టులు కూడా ఓటు బ్యాంకు కోసం వెంప‌ర్లాడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఇక‌, ఉన్నాయో లేవో కూడా తెలియ‌ని బీఎస్పీ, ఆప్‌లు కూడా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాయ‌ని అయితే.. వీటికి నామ్ కే వాస్తే అన్న‌ట్టుగా నియోజ‌క‌వ‌ర్గానికి 100 ఓట్లువ‌చ్చినా ఎక్కువేన‌ని స‌ర్వేలు తేల్చి చెబుతున్నాయి.