జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. వారాహి యాత్రపై ఆయన మాట్లాడుతూ.. తొలి విడత ప్యాకేజీ డబ్బులు అయిపోవడంతో పవన్ యాత్రను అర్ధంతరంగా ముగించేశాడని వ్యాఖ్యానించారు. వాస్తవానికి రెండు జిల్లాల్లోనూ పూర్తవుతుందని.. పేర్కొంటూ ముందు జనసేన షెడ్యూల్ ఇచ్చిందని.. కానీ, దీనిని మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ వెళ్లిపోయాడని చెప్పారు.
దీనికి కారణం.. ప్యాకేజీ సొమ్ము పూర్తిగా అందకపోయినా అయి ఉండాలని.. లేకపోతే, అయిపోయి అయినా అయి ఉండాలని వెల్లంపల్లి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ప్యాకేజీపై హైదరాబాద్‌లో చర్చలు జరుగుతున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. ఇది ఖరారయ్యాకే రెండో విడత వారాహి యాత్ర ఉంటుందని వ్యాఖ్యానించారు. అందుకే డేట్ ప్రకటించి కూడా.. షెడ్యూల్ ఇవ్వలేక పోతున్నారని.. అలాంటి ప్యాకేజీ స్టార్ గురించి.. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదని అన్నారు.
తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అయితే.. ఇతర నేతల మాట ఎలా ఉన్నా అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో తిరుమలలో రాజకీయ విమర్శలు చేయడం.. సవాళ్లు రువ్వడం(తాజాగా రోజా కూడా ఇక్కడే మాట్లాడుతూ.. పవన్‌కు సవాల్ రువ్వారు) వంటివాటిని భక్తులు విమర్శిస్తున్నారు. పవిత్ర తిరుమలను రాజకీయ వేదికగా మార్చడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు.