సంత‌నూత‌లపాడు టికెట్‌పై చంద్ర‌బాబు క్లారిటీ..!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం సంత‌నూత‌ల‌పాడు అభ్య‌ర్థిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. వ‌రుగా నియోజ‌క‌వ‌ర్గాల‌పై స‌మీక్ష చేస్తున్న చంద్ర‌బాబు.. ప‌లు నియోజ‌కవ ర్గాల్లోని ప‌రిస్థితుల‌ను ఆరాతీసి.. అక్క‌డి నేత‌ల‌తో చ‌ర్చిస్తున్నారు. ఈ క్ర‌మంలో సంత‌నూత‌ల పాడు నియోజ‌క‌వ‌ర్గంపైనా ఆయ‌న స‌మీక్షించారు. ఈ క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బీఎన్ విజ‌య‌కుమార్‌కే చాన్స్ ఇస్తున్నట్టు ప్ర‌క‌టించారు.

బీఎన్ విజ‌య‌కుమార్‌.. ఇప్ప‌టికి రెండు సార్లు టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డ పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగారు. అయితే.. ఆయన రెండు సార్లు కూడా.. ఓడి పోయారు. ఈ నేప‌థ్యంలో వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిని మార్చాల‌నే డిమాండ్లు తెర‌మీదికి వ‌చ్చాయి. పైగా.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయ‌ని చంద్ర‌బాబు సైతం గుర్తించారు.

అయితే.. 2009లో బీఎన్ విజ‌య‌కుమార్ కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్న త‌ర్వాత‌.. మ‌ళ్లీ రెండు సార్లు ఓడిపోవ‌డంతో ప్ర‌జ‌ల్లోసానుభూతి ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయ‌ని కూడా ప్ర‌స్తుతం లెక్క‌లు వేసుకున్నారు. అయితే.. కొంత మంది టీడీపీ నాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నా.. విజ‌య‌కుమార్‌కు దూరంగా ఉంటున్నా.. అవ‌న్నీ తాత్కాలిక‌మేన‌ని.. పైగా.. వైసీపీ ఎమ్మెల్యే క‌మ్ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌పై వున్న వ్య‌తిరేక‌త బీఎన్‌కు అనుకూలంగా ఉంటుంద‌ని అంచ‌నా వేసుకున్నారు.

ఈ క్ర‌మంలోనే బీఎన్‌కు చంద్ర‌బాబు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేశార‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. అయితే.. ఈ స‌మ‌యంలోనే కొన్ని కండిష‌న్లు కూడా పెట్టార‌ని అంటున్నారు. అసంతృప్త నేత‌ల‌తో వారానికి ఒక సారైనా భేటీ కావాల‌ని.. వారి అభిప్రాయాల‌ను కూడా తీసుకుని… ముందుకు సాగాల‌ని, అంద‌రినీ క‌లుపుకొని ముందుకు వెళ్లాల‌ని.. పార్టీ విజ‌య‌మే అంతిమ ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. దీనికి బీఎన్ కూడా అంగీక‌రించార‌ని అంటున్నారు.