ఐపీఎల్ ముచ్చట.. రూ.300 కోట్లు వస్తే చాలట

ఈ ఏడాది దుబాయ్ లో నిర్వహించనున్న ఐపీఎల్ టోర్నీ స్పాన్సర్ కు సంబంధించిన విశేషాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ప్రముఖ చైనా మొబైల్ సంస్థ వివో.. టైటిల్ స్పాన్సరర్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల భారత్ – చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి బయటకు తప్పుకుంటున్న సంగతి తెలిసిందే.

గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. వివో ప్రతి ఏటా రూ.440 కోట్లు బీసీసీఐకు చెల్లించాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో కొత్తగా వచ్చే టైటిల్ స్పాన్సరర్.. అంత మొత్తం ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల కారణంగా అంత భారీ మొత్తాన్ని చెల్లించేందుకు ముందు వస్తారా? అన్నది సందేమంగా మారింది. దీంతో.. అధికారిక స్పాన్సర్లను మూడు నుంచి ఐదుకు పెంచటం ద్వారా.. వీలైనంత ఎక్కువ మొత్తాన్ని రాబట్టాలని బోర్డు భావిస్తోంది.

ఇందులో భాగంగా పలు పేర్లు వినిపిస్తున్నాయి. స్పాన్సర్లు ఎంతమంది ఏమిటి? అన్నది పక్కన పెడితే.. మొత్తంగా రూ.300 కోట్లు రాబడిని సమకూర్చుకోవాలన్నది బోర్డు ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే అమెజాన్.. బైజూస్.. డ్రీమ్ లెవెన్ టైటిల్ స్పాన్సర్ షిప్ రేసులో ఉన్న విషయం తెలిసిందే. అనూహ్యంగా కొత్త సంస్థ తెర మీదకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వారం చివరికి టైటిల్ స్పాన్సర్ వ్యవహారాన్ని తేల్చేస్తారని భావిస్తున్నారు. మరి.. బోర్డు అంచనా వేస్తున్నట్లుగా రూ.300 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.