ఎన్నికల వేడి పెరిగిపోతున్న సమయంలో తెలంగాణాలో నేతల గోడ దూకుడ్లు బాగా పెరిగిపోతున్నాయి. ఒక పార్టీలో నేత మరో పార్టీలో చేరిపోతున్నారు. ఏ పార్టీనేత ఏరోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఎవరికీ తెలీటంలేదు. బీఆర్ఎస్, బీజేపీల నుండి బలమైన నేతలను కాంగ్రెస్ లోకి ఆకర్షించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోధరరెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో చేరిపోయారు.
మరికొంతమంది పై రెండుపార్టీల్లోని నేతలు కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నారనే ప్రచారం అలందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పీసీసీ ఒక సూత్రప్రాయమైన నిర్ణయం తీసుకుందట. అదేమిటంటే 2018లో కాంగ్రెస్ తరపున గెలిచి తర్వాత పార్టీని వదిలేసి బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎంఎల్ఏలను మాత్రం తిరిగి కాంగ్రెస్ లో చేర్చుకోకూడదని డిసైడ్ అయ్యిందట. పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నపుడు వదిలి వెళ్ళిపోవటం దారుణమని మెజారిటి సీనియర్లు భావించారట.
మహేశ్వరం నుండి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ లో గెలిచిన సుధీర్ రెడ్డి, తాండూరులో రోహిత్ రెడ్డి, కొల్హాపూర్ లో హర్షవర్ధన్ రెడ్డి, నకిరేకల్లోల చిరుమర్తి లింగయ్య, ఎలారెడ్డిలో సురేందర్ రెడ్డి, పాలేరు నుండి కందాళం ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెం నుండి వనమా వెంకటేశ్వర్లు, ఇల్లెందు నుండి హరిప్రియా నాయక్, పినపాకలో రేగా కాంతారావు, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, అసిఫాబాద్ లో ఆత్రం సక్కు ఉన్నారు.
ఈ ఎంఎల్ఏలపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందట. అందుకనే కేసీయార్ కూడా కొందరికి టికెట్లు ఇవ్వరనే ప్రచారం బాగా జరుగుతోంది. అందుకనే వీళ్ళలో కొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. ఈ నేపధ్యంలోనే వీళ్ళకు ఎంట్రీ ఇవ్వకూడదని సీనియర్లు అనుకుంటున్నారు. వీళ్ళస్ధానంలో కాంగ్రెస్ లోని ద్వితీయ శ్రేణి నేతలను లేదా అప్పట్లో వీళ్ళపై ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి చేర్చుకోవాలన్నది పీసీసీ ఆలోచనగా ఉంది. ఆలోచన మాత్రం బాగానే ఉంది కానీ చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.