టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాదయాత్రలో భాగంగా ఆయన వివిధ వర్గాల ప్రజలతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒకరిద్దరు వ్యక్తులు నారా లోకేష్‌కు ప్రశ్నలు సంధించారు. మీరు కూడా జగన్ లాగే వ్యవహరిస్తే.. మా పరిస్థితి ఏంటి? అని వారు ప్రశ్నించారు. దీనికి కారణం.. గత ఎన్నికలకు ముందు జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేశారు.
ఈ యాత్రలో అనేక మందికి ఆయన హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే వాటిని నెరవేస్తామని కూడా చెప్పారు. కానీ, కొన్ని నెరవేర్చారు.. ముఖ్యమైన సీపీఎస్ రద్దు, మద్యనిషేధం వంటివాటిని మరిచి పోయారు. దీంతో వాటినిప్రస్తావిస్తూ.. నారా లోకేష్‌ను కొందరు ప్రశ్నించారు. మీ పరిస్థితి ఏంటో చెప్పాలన్నా రు. నిజానికి వెయ్యి కిలో మీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేసుకున్నా.. ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇలాంటి ప్రశ్నలు సంధించలేదు.
కానీ, నెల్లూరులో వ్యాపారుల నుంచి ఇలాంటి ప్రశ్న వచ్చేసరికి నారా లోకేష్ ఒకింత తడబడ్డాడు. అయితే.. వెంటనే తేరుకుని.. తాను జగన్‌లా వ్యవహరించబోనని చెప్పారు. అంతేకాదు.. తనను జగన్‌తో పోల్చవద్దని.. ఆయన తేల్చి చెప్పారు. తాను ఇస్తున్న హామీల్లో నెరవేరని అంటూ ఏమీ లేవని.. గత అనుభవంతోనే తాను హామీలు ఇస్తున్నానని.. కేవలం ప్రజలను మోసగించేందుకు మాత్రమే జగన్ అప్పట్లో హామీలు గుప్పించా రని విమర్శలు గుప్పించారు.
అయితే.. తాను ఇస్తున్న హామీల్లోనూ ఒకటి రెండు ఏవైనా తప్పులు ఉంటే వాటిని చెబితే.. సరిచేసుకుంటా నని.. తాను జగన్ లా మొండిగా వ్యవహరించే వ్యక్తిని మాత్రం కాదన్నారు. ఇక, సీఎం ఎప్పుడవుతారు ? అన్న ప్రశ్నకు మాత్రం చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు మనకు ఉన్నారని.. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కాబోవని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేసుకోవడం అందరి కర్తవ్యమని ఆయన చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates