సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జగన్ భేటీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే విషయంపై చర్చించారని పుకార్లు వస్తున్నాయి. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ముందస్తు ఎన్నికల వ్యవహారం పై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రసక్తేలేదని సజ్జల తేల్చి చెప్పేశారు. ఇదే విషయాన్ని గతంలోనూ చాలాసార్లు స్పష్టం చేశామని అన్నారు. ముందస్తు ఎన్నికలపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. జగన్ కు ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల కాలం పరిపాలన చేస్తామని, చివరి రోజు వరకు ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని సజ్జల క్లారిటీనరిచ్చారు. ముందస్తు ఎన్నికలంటూ టీడీపీ ప్రచారం చేస్తోందని, ఇదంతా చంద్రబాబు గేమ్ ప్లాన్ అని సజ్జలు ఆరోపించారు.
చంద్రబాబు ఏం చేసినా ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సజ్జల. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. జగన్ చేపట్టిన పథకాలే మరోసారి ఆయనను గెలిపిస్తాయని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. కాగా, ముందస్తు ఎన్నికలపై సరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సింగిల్ గా ఎదుర్కొంటామని, ముందయినా..వెనుకైనా యుద్ధానికి సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.
అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్తామన్నది కేవలం కల్పిత ప్రచారం అని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళబోతున్నామని అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా తాము మాత్రం ఎన్నికల బరిలో ఒంటరిగానే దిగుతామని కారుమూరి స్పష్టం చేశారు.