వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సూత్రప్రాయంగా అంగీకరించారని, అయితే అందుకోసం ఆమె కొన్ని షరతులు విధించారని ప్రచారం జరుగుతోంది. తనను కేవలం తెలంగాణ రాజకీయాలకు పరిమితం చేయాలని, ఏపీ రాజకీయాలపై తాను ఫోకస్ చేయలేనని కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్, షర్మిలల మధ్య మాజీ మంత్రి జానారెడ్డి మధ్యవర్తిత్వం చేస్తున్నట్టుగా కూడా ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి … ఏపీ సీఎం జగన్ తో తాజాగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన పొంగులేటి….జగన్ తో భేటీ అయ్యారు. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. దాదాపు గంట సేపు ఇద్దరి భేటీ కొనసాగినట్టు తెలుస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో జగన్ తో పొంగులేటి భేటీ కావడం ఇది రెండోసారి. కాంగ్రెస్ లో చేరకముందు కూడా జగన్ ను పొంగులేటి కలిశారు.
అయితే, వ్యాపారవేత్త అయిన పొంగులేటి వ్యాపార వ్యవహారాలపై చర్చించేందుకే జగన్ ను కలిశారనుకోవచ్చు. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా మారిన తర్వాత కాంగ్రెస్ ను ద్వేషించే వైసీపీ అధినేత జగన్ ను పొంగులేటి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏపీసీసీ చీఫ్ గా ఆమెకు బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే షర్మిల ఏపీసీసీ పగ్గాలు చేపడితే దాని ప్రభావం వైసీపీపై ఎంత ఉంటుంది అన్న విషయంపై జగన్, పొంగులేటి చర్చించుకున్నారని తెలుస్తోంది. మరోవైపు, పులివెందుల నుంచి కాంగ్రెస్ తరఫున షర్మిలను బరిలోకి దించాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తుందని తెలుస్తోంది.