వైసీపీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2019లో పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గతంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినంత మద్దతు జగన్ కు రాలేదని కొందరు వైసీపీ నేతలు పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా టికెట్లు రేట్ల పెంపు వ్యవహారంపై పెద్ద రచ్చ జరిగింది. ఆ తర్వాత చిరంజీవితో పాటు కొందరు సినీ ప్రముఖులు సీఎం జగన్ తో చర్చలు జరిపి టికెట్ రేట్ల పెంపు వ్యవహారాన్ని సద్దుమణిగించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్…. సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సానుభూతిపరుడిగా ఇమేజ్ ఉన్న సుమన్ రాబోయే ఎన్నికల్లో కూడా జగన్ గెలిచి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఏపీలో పొత్తులపై ప్రతిపక్షాలకు క్లారిటీ లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీలున్నాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు జగన్ వెంటే ఉన్నారని రెడ్డి కమ్యూనిటీలో మెజారిటీ శాతం జగన్ వైపే మొగ్గుచూపుతోందని అన్నారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ లాగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసిన వారు దేశ చరిత్రలో మరెవరు లేరని సుమన్ వ్యాఖ్యానించారుర. ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలలో 95% అమలు చేశారని ప్రశంసలు గుప్పించారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా జనజీవనాన్ని అతలాకుతలం చేసిందని, అటువంటి సమయంలో కూడా పేదలను జగన్ ఆదుకున్నారని కొనియాడారు. జగన్ చేసిన సాయాన్ని ఎవరూ మర్చిపోలేరని చెప్పారు. అన్ని కులాల వారికి, వర్గాల వారికి సమన్యాయం చేసిన ఘనత జగన్ దేనని అన్నారు. తాజాగా జగన్ పై సుమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates